- రూ.58 కోట్లతో సత్యదేవుడి ఆలయం పునర్నిర్మాణం
- గుడినుంచి గోదావరి నది వరకు రోడ్డు వెడల్పు
- జూన్ 13న అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన
మంచిర్యాల, వెలుగు: తెలంగాణ 'అన్నవరం'గా ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆదరణకు నోచుకోకుండా ఉన్న దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాల పనుల్లో భాగంగా రూ.58 కోట్లతో గూడెం గుట్ట రూపురేఖలు మార్చి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల సరనన నిలిపేందుకు నడుం బిగించింది.
సీఎం రేవంత్రెడ్డి గతంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆలయ అభివృద్ధికి ఇచ్చిన హామీ నెరవేరబోతోంది. ఈ నెల 13న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గూడెం సత్యనారాయణస్వామి సన్నిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఆలయం పూర్తి స్థాయిలో డెవలప్ కానుండడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి..
గోదావరి తీరాన ఉన్న గూడెం గుట్టపై వెలిసిన ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఏపీలోని అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం తర్వాత అంతటి ప్రసిద్ధి చెంది తెలంగాణ అన్నవరంగా పిలువబడుతోంది. ఏటా స్వామిని లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు.
కార్తీక, శ్రావణ మాసాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలకు ప్రసిద్ధి. దంపతులు జంటగా వ్రతాలు ఆచరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్ముతారు. అలాగే ప్రతి ఏడాది ఇక్కడ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. సమీపంలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి సత్యదేవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ.
ఆలయ పునర్నిర్మాణంపై దృష్టి
భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భాల్లో గుట్టపై ఇరుకుగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గుడి పునర్మిర్మాణంలో భాగంగా గుట్టను చదును చేసి ప్రాంగణాన్ని విస్తరించనున్నారు. ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేస్తారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా గర్భగుడిని మినహాయించి మిగతా ప్రాంతాన్ని విశాలంగా మార్చేందుకు ప్రణాళిక రూపొందించారు.
గుట్టపైకి వెళ్లేందుకు గతంలో నిర్మించిన ఘాట్ రోడ్డు వర్షాలకు ధ్వంసం కావడంతో దానిని పునర్నిర్మించనున్నారు. స్వామివారి సన్నిధిలో భక్తులు నిద్ర చేయడానికి సరైన సౌకర్యాలు లేవు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ విడిది చేసేందుకు వసతి గదుల నిర్మాణం చేపడతారు. అలాగే టెంపుల్ నుంచి గోదావరి వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్డు వెడల్పు, రోడ్డుకు ఇరువైపులా గ్రీనరీ ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు.
