ఒక నవజాత శిశువు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం.. ఆ బిడ్డకు తొలి పరిచయం తల్లి ఒడితో, తొలి ఆహారం తల్లిపాలతోనే మొదలవుతుంది. ఆ చిన్నారి జీవితంలో మొదటి రక్షణ కవచం, తొలి టీకా, తొలి పోషకాహారం అన్నీ ఒకటిగా కలిసిన అమూల్యమైన వరం అదే. ఆధునిక జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, కుటుంబ పరిస్థితులు, సరైన అవగాహన లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో ఈ సహజమైన అనుబంధం క్రమంగా సవాళ్లను ఎదుర్కొంటోంది.
అందుకే తల్లిపాల విలువను గుర్తుచేయడమే కాదు, ప్రతి తల్లి తన బిడ్డకు ఆ హక్కును అందించగలిగేలా కుటుంబం, ఆరోగ్య వ్యవస్థ, కార్యాలయాలు, సమాజం కలిసి అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకే ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ ఏడాది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన థీమ్ ఆ సందేశాన్నే మరింత బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది దీనికి డబ్ల్యూహెచ్ఒ ప్రకటించిన థీమ్ “బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఎ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్”. అంటే జీవితానికి నిలకడైన ఆరంభం ఇవ్వాలంటే, ఇప్పటివరకు పనిచేస్తున్న తల్లిపాల మద్దతు పద్ధతులనే మరింత బలపరచాలన్నమాట. ఈ ప్రచారం ఆరోగ్య వ్యవస్థలు, పని ప్రదేశాలు, కుటుంబాలు, సమాజం కలిసి తల్లిపాలను ఆదరించాలనే సందేశాన్ని ఇస్తోంది. ఈ సూచనల వెనక చాలా స్పష్టమైన కారణం ఉంది.
తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడమే కాదు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సాయపడతాయి. శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, దీర్ఘకాలిక మేల్కొలుపు అన్నింటికీ ఇది బలమైన పునాది అవుతుంది.కానీ సమస్య తల్లిపాల విలువ తెలియకపోవడం కాదు. వాటిని కొనసాగించడానికి అవసరమైన సాయం లేకపోవడంలో ఉంది. చాలా మంది తల్లులు ఉద్యోగ బాధ్యతలతో సతమతమవ్వడం. కుటుంబ మద్దతు, సరైన గైడెన్స్, ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు వంటివి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే డబ్ల్యూహెచ్ఒ 2026 ప్రచారంలో “వామ్ చైన్ ఆఫ్ సపోర్ట్’’ అనే మద్దతు గొలుసును బలపరచాలని చెప్తోంది.
ఈ సపోర్ట్ చైన్ ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, కుటుంబం, పని ప్రదేశాలు, విధాన నిర్ణేతలు అందరూ భాగమే. తల్లికి సరైన కౌన్సెలింగ్, ప్రసూతి తర్వాత మద్దతు, పని ప్రదేశంలో అవసరమైన వసతులు ఉంటే తల్లిపాలు ఇవ్వడం కష్టమైన పని కాకుండా సహజమైన దినచర్యగా మారుతుంది.
2026 వారోత్సవం చెప్పే అసలు మాట..
కొత్తగా ఏదో ప్రారంభించాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ఫలితమిస్తున్న వాటిని మరింత బలంగా అమలు చేయాలి. తల్లిపాల విషయంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే ఒక తల్లి సపోర్ట్ పొందితే, ఒక బిడ్డకు ఆరోగ్యకరమైన ఆరంభం దొరుకుతుంది. ఆ ఆరంభమే భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు.
ఇది తల్లి, బిడ్డ, కుటుంబం, సమాజం కలిసి నిలబడాల్సిన ప్రజారోగ్య సందేశం. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే తల్లిని గౌరవించడం, బిడ్డను రక్షించడం, ఆరోగ్యకరమైన తరాన్ని నిర్మించడం.
తల్లిపాలు అనేది కేవలం బిడ్డకు ఇచ్చే ఆహారం మాత్రమే కాదు. అది శిశువుకు సహజంగా లభించే తొలి పోషకాహారం, తొలి రక్షణ కూడా. డబ్ల్యూహెచ్ఒ, యునిసెఫ్ సూచనల ప్రకారం పుట్టిన ఒక గంటలోపే తల్లిపాలు మొదలుపెట్టాలి. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించినా, రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించొచ్చు.
