- దశాబ్దాల కాలంగా తిష్ట వేసిన అధికారులు
- ఆర్థిక లావాదేవీలున్న పోస్టుల్లో వారిదే దర్జా
- సింగరేణిలో లాబీయింగ్‌లతో కొందరిదే హవా..
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో కొందరు అధికారులు ఏండ్ల తరబడి ఒకేచోట తిష్టవేశారు. తమకున్న లాబీయింగ్, పలుకుబడితో ట్రాన్ఫర్ కాకుండా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న కీలక పోస్టుల్లో పనిచేస్తున్న పలువురు అధికారులు బదిలీలకు దూరంగా ఉంటూ అదే ఏరియాల్లో కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తోంది.
మమ్మల్ని ఎవరూ కదిలించలేరు!
“మాకు పైస్థాయి నుంచి ఆశీస్సులున్నాయి. మమ్మల్ని ఎవరూ కదిలించలేరు. ఏరియాలోనే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తామే తప్ప, ఏరియా మారేది లేదు” అంటున్న పలువురి అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అదనపు జనరల్ మేనేజర్లు , డిప్యూటీ జనరల్ మేనేజర్లు , ఎస్‌ఈలు, డీవైఎస్‌ఈలు, జేఈలు, సెక్యూరిటీ అధికారులు, డీవైజీఎంలు, జేఆర్‌టీవో స్థాయి అధికారులు పదేళ్ల నుంచి 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. వీరికున్న పలుకుబడిని చూసి కింది స్థాయి ఉద్యోగులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఫోకల్ పాయింట్లలోనూ వీరు ఏళ్లుగా కొనసాగుతుండడం గమనార్హం.
సింగరేణి వ్యాప్తంగా 10 నుంచి 15 ఏళ్లకు పైగా ఒకే ఏరియాలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారులు దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు ఇటీవల యాజమాన్యం గుర్తించింది. సాధారణంగా మూడేళ్ల నుంచి నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు బదిలీ చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న విభాగాలు, గనుల్లో పనిచేసే వారిని రెండేళ్ల నుంచి మూడేళ్లకే బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అధికారులు ఏరియాలు దాటి వెళ్లకుండా ఉన్నప్పటికీ, యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల పై కనబడని చర్యలు
ఇల్లెందు సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి దాదాపు ఎనిమిదేళ్లుగా విభాగాలు మారుతూ అదే ఏరియాలో కొనసాగుతున్నారు. ఏరియా స్టోర్‌లో జరిగిన భారీ రాగి (కాపర్) చోరీ కేసులో ఆ అధికారిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో స్టోర్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని యాజమాన్యం ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించింది. ముగ్గురు సెక్యూరిటీ గార్డుల ఇంక్రిమెంట్లను కూడా నిలిపివేసింది.
అయితే ఈ అధికారిపై మాత్రం విచారణ పేరుతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కంపెనీలో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ సివిల్ విభాగంలో జేఆర్‌టీవోగా పనిచేస్తున్న ఓ అధికారి, జేవీఆర్ ఓసీ-2, పీకే ఓసీ, ఆర్జీ ఓసీ-3, ఆర్జీ ఓసీ-2, మణుగూరు ఓసీ, విజిలెన్స్, మణుగూరు ఏరియా వర్క్‌షాప్, ఆర్జీ-3 ఏరియా వర్క్‌షాప్, కేటీకే-5 ఇంక్లైన్, ఆర్కే-7 ఇంక్లైన్, ఐకే-1ఏ, పవర్ ప్రాజెక్ట్స్ డివిజన్, ఆర్జీ-1 ఏరియా వర్క్‌షాప్, ఎస్‌ఆర్‌పీ ఓసీ-2తో పాటు పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు దాదాపు 30 నుంచి 40 మందికి పైగా ఒకే ఏరియాల్లో 10 నుంచి 15 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారు.
ఐదు నుంచి పదేళ్లలోపు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు కూడా కంపెనీలో పెద్ద ఎత్తున ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దశాబ్దాల కాలంగా ఒకే ఏరియాలో పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో సింగరేణి విజిలెన్స్ విభాగం కూడా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చిన్న తప్పు చేసిన కార్మికులపై హడావుడి చేసే విజిలెన్స్ విభాగం, ఏళ్ల తరబడి ఒకే ఏరియాలో విధులు నిర్వహిస్తున్న అధికారుల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా ఒకే ఏరియాలో, ముఖ్యంగా ఫోకల్ పాయింట్లలో కొనసాగుతున్న వారిపై డైరెక్టర్ (పా), సీఎండీ ప్రత్యేక దృష్టి సారించాలని కార్మికులు కోరుతున్నారు.
కీలక విభాగాల్లోనూ అదే పరిస్థితి
సింగరేణిలో ఆర్‌సీహెచ్‌పీలు కీలకమైనవి. ఇక్కడ పనిచేసేందుకే పెద్ద ఎత్తున లాబీయింగ్‌లు కొనసాగుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌సీహెచ్‌పీ, విజిలెన్స్, ఓసీలు, పర్చేస్, సివిల్, వర్క్‌షాప్, ట్రాన్స్‌పోర్ట్, మైనింగ్, ఫైనాన్స్‌తో పాటు పలు విభాగాలు ఫోకల్ పాయింట్ల కిందకు వస్తాయి. కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీహెచ్‌పీలో ఓ ఎస్‌ఈ స్థాయి అధికారి దాదాపు 12 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
