- ఈసారి గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం 6.18 కోట్లు.. నాటింది 2.59 కోట్ల మొక్కలే
- రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 42 శాతమే పూర్తి
- పని దినాల కల్పనలోనూ ఆఫీసర్లు ఫెయిల్
- 59.52 లక్షల పని దినాల్లో సాధించింది 14.44 లక్షలే
- జనగామలో 5 శాతమే ప్లాంటేషన్
- ఆసిఫాబాద్‌లో ఉపాధి పని దినాలు సున్నా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వన మహోత్సవం’ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకెళ్లడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో మొక్కలు నాటే కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు, సాధిస్తున్న ప్రగతికి పొంతన కుదరడం లేదు.
మొక్కల పెంపకంలోనే కాకుండా, గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి పని దినాలు కల్పించడంలోనూ ఆఫీసర్లు ఆశించిన స్థాయి ఫలితాలు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. ప్లాంటేషన్ టార్గెట్లో సగానికి పైగా పెండింగ్ ఉండగా, 59.52 లక్షల ఉపాధి పని దినాలకు సాధించింది 14.44 లక్షలే కావడం గమన్హారం.
లక్ష్యం 6.18 కోట్లు.. సాధించింది 2.59 కోట్లే..
ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల పరిధిలో 6.18 కోట్ల మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందులో 274.88 లక్షల ఇంటింటి మొక్కలు, 343.62 లక్షల ఇతర ప్లాంటేషన్ మొక్కలున్నాయి. కానీ, ఇప్పటివరకు కేవలం 2.59 కోట్ల మొక్కలే నాటారు. అంటే లక్ష్యంలో 42 శాతం మొక్కలు మాత్రమే నాటారని చెప్పుకోవచ్చు. 343.62 లక్షల గుంతలు తవ్వాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 229.10 లక్షలు గుంతలు మాత్రమే పూర్తి చేశారు.
ఉపాధి హామీ పథకం(ప్రస్తుతం వీబీజీ రామ్జీ)తో అనుసంధానిస్తూ మొక్కలు నాటడం, గుంతలు తవ్వడం ద్వారా గ్రామీణ పేదలకు పెద్దఎత్తున పని కల్పించవచ్చని భావించారు. ప్రతి గుంత తవ్వకం, మొక్కనాటే పనికి సగటున రూ.53.18 చొప్పున 59.52 లక్షల ఉపాధి పని దినాలు సృష్టించాలని టార్గెట్ పెట్టారు. కానీ, అధికారుల ఉదాసీనతతో ఇప్పటివరకు కేవలం 14.44 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. అంటే 24 శాతం పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. ఇంకా 45.08 లక్షల పని దినాలు కల్పించాల్సి ఉంది.
అట్టడుగున జనగామ.. ఆసిఫాబాద్‌లో సున్నా..
ప్లాంటేషన్, ఉపాధి పని దినాల కల్పనలో కొన్ని జిల్లాల పని తీరు నిరాశాజనకంగా ఉంది. ప్లాంటేషన్‌లో జనగామ జిల్లా లక్ష్యం 19.20 లక్షల మొక్కలు కాగా, నాటింది కేవలం 1.01 లక్షలే కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ 11శాతం, సూర్యాపేట 16 శాతం, రంగారెడ్డి 19శాతం, వరంగల్ లో 27 శాతం నమోదైంది. ఉపాధి కల్పనలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3.99 లక్షల పనిదినాల లక్ష్యానికి గాను కేవలం 20 వేలు మాత్రమే నమోదయ్యాయి. ఫలితంగా ఇక్కడ సాధించిన ప్రగతి సున్నా శాతంగా నమోదైంది. నిర్మల్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కేవలం 2 శాతమే ఉపాధి కల్పించారు. ఆదిలాబాద్ 4 శాతం, మహబూబాబాద్ 5 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 6 శాతం, సిద్దిపేట జిల్లాలో 6 శాతంతో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి.
మొక్కలు నాటే కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా 71 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నాగర్‌కర్నూల్ 62 శాతం, జోగులాంబ గద్వాల 62 శాతం, జగిత్యాల 60 శాతం జిల్లాలు ఉన్నాయి. ఇక ఉపాధి పని దినాల సాధనలో హన్మకొండ 105 శాతం లక్ష్యానికి మించగా, జోగులాంబ గద్వాల 88 శాతం, రాజన్న సిరిసిల్ల 67 శాతం, వికారాబాద్ 66 శాతం జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి. వర్షాకాలం సగానికి పైగా ముగిసిపోతున్నా.. ప్లాంటేషన్ లో వేగం పెరగకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
