న్యూఢిల్లీ: యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీగా చర్చ జరిగింది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండీ కూటమి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ బిల్లుపై చర్చలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇడియట్స్ (మూర్ఖులు), అందభక్తులు ఎవరి మాట వినరని నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసన చేసిన విద్యార్థులు తనతో చెప్పారని అన్నారు. దీంతో రాహుల్ గాంధీ ఇడియట్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాహుల్ గాంధీ అన్ పార్లమెంటరీ పదాలు వాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పీకర్‌ను కోరారు. మరోవైపు.. బీజేపీ ఎంపీలు రాహుల్ ప్రసంగానికి పదే పదే అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తాను బీజేపీ ఎంపీలని మూర్ఖులు అనలేదని.. కొందరు విద్యార్థులు తనతో ఈ విషయం చెప్పారని వివరణ ఇచ్చారు. మొత్తానికి రాహుల్ ఇడియట్ కామెంట్స్ లోక్ సభ దద్దరిల్లింది.
యాంటి పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆవేదనతోనే విద్యార్థులు రోడ్డెక్కారు. బీజేపీ ఎంపీల పిల్లలను అడిగినా విద్యార్థుల ఆ బాధేంటో తెలుస్తోంది. విద్యార్థులు ఓపెన్‌గా తమ అభిప్రాయాలు చెప్పారు. విద్యార్థుల ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నరు. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. అన్ని పార్టీలు విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి. కొంతమంది ఇడియట్స్‌కు మా బాధ అర్ధం కావడం లేదని విద్యార్థులు నాతో చెప్పారు. విద్యార్థుల ఆందోళనను బీజేపీ నేతల పిల్లలు కూడా సమర్ధించారు. విద్యార్థుల ఆందోళనలపై ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలయ్యాడు’’ అని అన్నారు.
