న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్, సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కంగనా రనౌత్‌ను ఆమె సొంత పార్టీ నేతలే పట్టించుకోరని.. ఆమెను మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం (జులై 29) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సౌరవ్ దాస్ విద్యార్థి కాదని.. అతడు పూర్తిగా పనికిరాని నిరుద్యోగి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం అతడి వయస్సు 28 సంవత్సరాలు.. ఆ వయస్సులో అతడు విద్యార్థి ఎలా అవుతాడో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. అతడి వయస్సు ఉన్నప్పుడు నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా పని పాట లేకుండా తిరిగే బదులు ముందేదైనా స్కిల్ నేర్చుకోవాలని హితవు పలికారు.
తాను రాజకీయాల్లోకి వచ్చి కేవలం రెండేళ్లు అయినా, ప్రజా జీవితంలో 20 ఏళ్లుగా ఉన్నానని పేర్కొన్నారు. తాను కేవలం నటిని మాత్రమే కాదని.. నిర్మాతగా, స్క్రీన్‌రైటర్, వ్యాపారవేత్తగా రాణించనన్నారు. తనకున్న ఈ బిజీ షెడ్యూల్ వల్లే అన్ని వేళలా తనకు భారీ డిమాండ్ ఉంటుందని.. అది సౌరవ్ దాస్ లాంటి ఒక నిరుద్యోగికి అర్థం కాదని ఎద్దేవా చేశారు. సౌరవ్ దాస్ సమస్యలు వ్యక్తిగతమైనవని.. విద్యార్థులు, దేశానికి సంబంధించినవి కావని అన్నారు.
