వరుస హత్యలు, దాడులతో వణుకుతున్న వరంగల్..సిటీలో వారంలో మూడు మర్డర్లు

వరుస హత్యలు, దాడులతో  వణుకుతున్న వరంగల్..సిటీలో వారంలో మూడు మర్డర్లు
  •     పెట్రేగిపోతున్న పాత రౌడీషీటర్లు.. అల్లరిమూకలు 
  •     క్రైమ్ తగ్గించే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టట్లేదనే విమర్శలు

వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌‌‌‌లో వరుస హత్యలు, దాడులు ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమవుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ తూర్పు ప్రాంతంలో ఏ రోజు ఎక్కడ మర్డర్​ జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. పోలీసులు రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. పాత రౌడీషీటర్లు, లిక్కర్, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఉన్న వారే ఈ నేరాలకు పాల్పడుతున్నారు.

హత్యలతో వణుకుతున్న వరంగల్ సిటీ..

గ్రేటర్ వరంగల్ పరిధిలో వరంగల్ సిటీ ప్రాంతంలో వరుసగా దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మిల్స్ కాలనీ, ఏనుమాముల, గీసుగొండ పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లోని కోటిలింగాల గుడి, పరిమళ కాలనీ, చింతల్ బ్రిడ్జి ప్రాంతాలు నేరాలకు కేంద్రంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 18న గీసుగొండ పీఎస్​ పరిధిలో కాంగ్రెస్ నాయకుడు అడుగ మహేశ్‌‌‌‌పై పెట్రోల్ పోసి నిప్పంటించగా, చికిత్స పొందుతూ 19న ఆయన మృతిచెందారు. 25న మిల్స్ కాలనీ పీఎస్​ పరిధిలో మాద అనిల్‌‌‌‌ను కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అదే రోజు చింతల్ బ్రిడ్జి వద్ద ఆవుల మల్లికార్జున్ అనే యువకుడిపై ఇటుకరాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడగా, అతడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే రోజున దుగ్గొండి మండలం నాచినపల్లిలో ముసుకుల సాంబరెడ్డి హత్యకు గురయ్యాడు. 

పోలీసులకు సవాల్ విసురుతున్న రౌడీలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 702 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే వీరి కదలికలపై నిరంతర నిఘా లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ వరుస దాడులతో రౌడీ మూకలు పోలీసులకు సవాల్ విసిరాయి. ఇటీవల జరిగిన హత్యలు, దాడుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో చాలామంది గతంలో జైలు శిక్ష అనుభవించినవారు లేదా ఇప్పటికే పలు కేసుల్లో పోలీస్ రికార్డుల్లో ఉన్నవారేనని తెలుస్తోంది. నేరప్రవృత్తిని ప్రారంభ దశలోనే అరికట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రౌడీయిజం మరింత పెరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

24 గంటల లిక్కర్.. బిర్యానీ సెంటర్స్..

వరుస హత్యలు, దాడులకు గంజాయి, డ్రగ్స్, మద్యం సులభంగా లభించడం ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నప్పటికీ, వాటి నియంత్రణలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ముఖ్యంగా రాత్రి 11 గంటలకు బార్లు మూసివేసిన తర్వాత బెల్ట్ షాపుల ముసుగులో నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కమిషనరేట్‌‌‌‌కు సమీపంలోని కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రాత్రి వేళల్లో పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. అలాగే రాత్రి 10 గంటల తర్వాత చిన్న వ్యాపారుల బండ్లను తొలగించే పోలీసులు, రాత్రంతా కొనసాగుతున్న కొన్ని బిర్యానీ సెంటర్లు, అక్రమ కార్యకలాపాలపై మాత్రం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్రోలింగ్ సమయంలో ముందస్తు సమాచారం అందడంతో దుకాణాలు తాత్కాలికంగా మూసివేసి, పోలీసులు వెళ్లిన వెంటనే తిరిగి తెరుస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇటీవల సంచలనం సృష్టించిన ఘటనలు

కాంగ్రెస్ నేత అడుగ మహేశ్ హత్య: ఈ నెల 18న ఎన్టీఆర్ నగర్‌‌‌‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అడుగ మహేశ్‌‌‌‌పై కత్తి కుమార్ అనే నిందితుడు మరో ఏడుగురితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 2018లో జరిగిన సాంబయ్య హత్య కేసులో కత్తి కుమార్‌‌‌‌కు యావజ్జీవ శిక్ష పడగా, ఇటీవల బెయిల్‌‌‌‌పై విడుదలయ్యాడు. బయటకు వచ్చిన కొద్ది రోజులకే మరో హత్యకు పాల్పడ్డాడు.

మాద అనిల్ హత్య: హైదరాబాద్‌‌‌‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న మాద అనిల్ ఏకాదశి సందర్భంగా స్వగ్రామానికి రాగా, పాత కక్షల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన మహేశ్ ఈ నెల 26న కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లి లొంగిపోయాడు. 

పగిండ్ల సురేశ్​పై దాడి: రెండు నెలల కింద ఖిలా వరంగల్‌‌‌‌కు చెందిన పగిండ్ల సురేశ్​ను పసునూరి కల్యాణ్, మరో ఇద్దరు వ్యక్తులు బైక్​పై కిడ్నాప్​చేసి కోటిలింగాల ప్రాంతానికి తీసుకెళ్లి పునాది రాళ్లతో దారుణంగా దాడి చేశారు. ఈ దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రధాన నిందితుడు కల్యాణ్‌‌‌‌తో పాటు రాయలమ్మ అనే మహిళపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి.

పోలీస్ స్టేషన్‌‌‌‌లోనే దాడి: కరీమాబాద్‌‌‌‌కు చెందిన క్యాతం రంజిత్, శ్యామల సాయిరామ్‌‌‌‌ ఇటీవల ఓ బార్​ వద్ద కొందరిపై దాడి చేస్తున్నారన్న సమాచారంతో మట్వాడా పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్​కు తీసుకువచ్చారు. దీంతో వారు పోలీస్ స్టేషన్‌‌‌‌లోనే విధులు నిర్వహిస్తున్న ఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.