టీ20 వరల్డ్‌కప్ 2028కు 14 నగరాల పోటీ.. ఎక్కడెక్కడో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్ 2028కు 14 నగరాల పోటీ.. ఎక్కడెక్కడో తెలుసా..?

2028 T20 World Cup: 2028లో జరగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు వేదికల ఎంపిక ప్రక్రియ అధికారికంగా స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా 14 నగరాలతో కూడిన జాబితాను రెడీ చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమర్పించినట్లు తెలుస్తుంది. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం తుది మ్యాచ్‌ల కోసం 8 నుంచి 10 స్టేడియాలను మాత్రమే సెలక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో బిడ్లు దాఖలు చేసిన నగరాల్లో 4 నుంచి 6 నగరాలు ఆతిథ్య రేసు నుంచి తప్పుకోవాల్సిందే. 

న్యూజిలాండ్‌కు ఛాన్స్.. ఆసీస్‌లో 9 నగరాల బిడ్లు: 
క్రికెట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కలిసి 2028 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించబోతున్నాయి. మెన్స్ టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ సహ-ఆతిథ్యం ఇవ్వడం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఆస్ట్రేలియా నుంచి మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్, పెర్త్, బ్రిస్బేన్, హోబార్ట్, గీలాంగ్, కాన్‌బెర్రా, డార్విన్ నగరాలు బిడ్లు సమర్పించగా, వీటిలో దాదాపు 5 నగరాలు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు న్యూజిలాండ్ నుంచి ఆక్లాండ్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్, హామిల్టన్, డునెడిన్ నగరాలు పోటీ పడుతున్నాయి. ఆక్లాండ్, వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్ లాంటి కనీసం 3 ప్రధాన నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగిస్తున్నారు. 

ఫైనల్ కోసం తీవ్ర పోటీ.. ఆతిథ్యంపై అనిశ్చితి
సాధారణంగా ఆస్ట్రేలియాలో జరిగే ప్రధాన ప్రపంచకప్ ఫైనల్స్ అన్నింటికీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదిక కానుంది. కానీ ఈసారి ఫైనల్‌కు ఎంసీజీయే వేదికవుతుందని ఖచ్చితంగా చెప్పలేమని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ వెల్లడించారు. అడిలైడ్ ఓవల్‌లో ఫైనల్ మ్యాచ్ పెట్టేందుకు దక్షిణ ఆస్ట్రేలియా సర్కార్ ప్రత్యేక ఆర్థిక ప్రతిపాదనను రెడీ చేస్తుండగా, పశ్చిమ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ కూడా ప్రధాన మ్యాచ్‌ల ఆతిథ్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

►ALSO READ | గంభీర్ సన్నిహితుడు అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా.. ఐపీఎల్లో కేకేఆర్‌తో ర్యాన్ టెన్ డీల్!

20 జట్లు, 55 మ్యాచ్‌లు.. ఎలిమినేటర్ ఫార్మాట్: 
2028 టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొనబోతుండగా, 55 మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది. ఈసారి ఐసీసీ టోర్నమెంట్ ఫార్మాట్‌లో సరికొత్త మార్పులు చేస్తూ ఐపీఎల్ తరహాలో ఎలిమినేటర్ మ్యాచ్‌లను ప్రవేశ పెట్టింది. వాణిజ్య విలువ, ప్రసారకర్తల డిమాండ్, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వాల సపోర్టును ప్రామాణికంగా తీసుకుని ఐసీసీ త్వరలోనే ఆతిథ్యం ఇచ్చే స్టేడియాల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.