కరీంనగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల దందా.. ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ 

కరీంనగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల దందా.. ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ 

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల అక్రమ డిస్పోజల్ దందాపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఈ ఆరోపణలపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేసి విచారణ వివరాలను అధికారికంగా వెల్లడించారు.

డ్రూంక్ అండ్ డ్రైవ్ నిందితుడి వద్ద నుంచి రూ. 15 వేల లంచం తీసుకుని, డూప్లికేట్ ఎస్టీసీ  నంబర్‌తో కేసును అక్రమంగా ముగించినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన ఆర్ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కిరణ్‌లను సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ జరపగా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 113 కేసుల్లో డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ నంబర్లను గుర్తించారు. అయితే వీటిలో 13 కేసుల్లో మాత్రమే అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. ఇందులో 3 కేసులు కోర్టుకు హాజరు కాకుండానే డిస్పోజ్ చేయగా మరో 10 కేసుల్లో అసలు జరిమానాకు మించి అదనంగా రూ. 9,700 వసూలు చేసినట్లు తేలింది. మొత్తం 14 కేసుల్లో కలిపి రూ. 34,700 మాత్రమే అవినీతి జరిగిందని సీపీ స్పష్టం చేశారు.

►ALSO READ | పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వేపై భారీగా వర్షపు నీరు..ట్రాఫిక్‌కు అంతరాయం

సోషల్ మీడియా , ఇతర వేదికల్లో వస్తున్నట్లుగా రూ. 30 లక్షల అవినీతి జరిగిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఈ డీడీ కేసులపై విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. వాహనదారులు ఎవరైనా సరే జరిమానాలను నేరుగా కోర్టుకే చెల్లించాలని, ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే సీపీ కార్యాలయం లేదా ఏసీబీ  అధికారులకు ఫిర్యాదు చేయాలని సీపీ గౌష్ ఆలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.