చెన్నూరులో భారీ వర్షాలు.. మంత్రి వివేక్ ఆదేశాలతో.. అక్కపల్లి కాజ్ వే దగ్గర బారికేడ్లు, పోలీస్ పికెటింగ్

చెన్నూరులో భారీ వర్షాలు.. మంత్రి వివేక్ ఆదేశాలతో.. అక్కపల్లి కాజ్ వే దగ్గర బారికేడ్లు, పోలీస్ పికెటింగ్

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం ( జులై 28 ) పలు జిల్లాలు సహా హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసింది. బుధవారం ( జులై 29 ) కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కూడా భారీ వర్షం కురిసింది. అక్కపల్లి కాజ్ వే పైనుంచి ఉదృతంగా వరద నీరు ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో కాజ్ వే ఇరువైపులా బారికేడ్లు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు అధికారులు.

అక్కపల్లి వాగు దగ్గర నీటి ప్రవాహాన్ని పరిశీలించారు తహసీల్దార్ మల్లికార్జున్, పట్టణ సీఐ, ఎంపీడీవో. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రాకూడదని సూచిస్తున్నారు అధికారులు. వాగులు, చెరువుల వద్దకు చేపల వేటకు గానీ, ఫోటోలు,సెల్ఫీల కోసం గానీ వెళ్లోద్దని హెచ్చరించారు.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సమాచారం అందిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు అధికారులు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలను తాకొద్దని, వాటి దగ్గర నిలబడకూడదని సూచించారు.వర్షాల వల్ల ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు అధికారులు.