India Coaching Staff: భారత క్రికెట్ జట్టు సపోర్ట్ స్టాఫ్‌కు చెందిన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల నిష్క్రమణపై వస్తున్న వార్తలపై బీసీసీఐ (BCCI) స్పందించింది. వారు తమ పదవులకు రాజీనామా చేయలేదని, వారి కాంట్రాక్ట్ గడువు ముగియడంతోనే కోచింగ్ స్టాఫ్ నుంచి వైదొలిగారని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా తేల్చి చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమయ్యే శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందే ఇండియాకు కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమిస్తామని వెల్లడించారు.
జూన్‌లో ముగిసిన గడువు:
బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా మాట్లాడుతూ.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10వ తేదీతో, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఏడాది పొడిగించిన కాంట్రాక్ట్ జూన్ 8తోనే ముగిశాయి. కానీ, ఇటీవలే ముగిసిన యూకే (ఇంగ్లాండ్) పర్యటన పూర్తయ్యే వరకు బోర్డు వీరి సేవలను కొనసాగించింది. వారి కాంట్రాక్ట్ గడువు ముగిసినందున మళ్లీ పొడిగించకూడదని నిర్ణయించుకున్నాం.. కాబట్టి ఇక్కడ రాజీనామా చేశారనేది పూర్తి అవాస్తవం.. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం రెండు మూడు పేర్లను పరిశీలిస్తున్నాం, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని సైకియా చెప్పారు.
కేకేఆర్‌లోకి డోస్చేట్.. సుదీర్ఘ జర్నీకి దిలీప్ స్వస్తి:
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు అత్యంత సన్నిహితుడైన నెదర్లాండ్స్ దిగ్గజం ర్యాన్ టెన్ డోస్చేట్, ఐపీఎల్ 2024లో కేకేఆర్ (KKR) సపోర్ట్ స్టాఫ్ నుంచి వైదొలిగి గంభీర్‌తో పాటు టీమిండియాలోకి వచ్చారు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆయన మళ్లీ కేకేఆర్ కోచింగ్ సెటప్‌లోకి తిరిగి వెళ్ళాడు. మరోవైపు, టీ దిలీప్ 2021లో రాహుల్ ద్రవిడ్ హయాంలో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి, గంభీర్ ప్రధాన కోచ్‌గా వచ్చాక కూడా తన పదవిని నిలబెట్టుకున్న ఏకైక కోచ్‌గా నిలిచారు.
శ్రీలంక పర్యటనకు ముందే కొత్త సపోర్ట్ స్టాఫ్:
ప్రస్తుతం భారత జట్టు కోచింగ్ విభాగంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కొనసాగుతున్నారు. రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లనున్న ఇండియన్ టీమ్ కి మార్గదర్శనం చేసేందుకు డోస్చేట్ డస్కాటే, టీ దిలీప్‌ల స్థానాల్లో కొత్త కోచ్‌లను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.
