16 రోజుల్లో కొట్టుకుపోయిన రూ.16 కోట్ల బ్రిడ్జి: గ్రేట్ ఇండియన్ కాంట్రాక్టర్స్..!

16 రోజుల్లో కొట్టుకుపోయిన రూ.16 కోట్ల బ్రిడ్జి: గ్రేట్ ఇండియన్ కాంట్రాక్టర్స్..!

అదో ఘోర విషాధం.. 2025 సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా బ్రిడ్జి కొట్టుకుపోయింది.. ఆ వరదల్లో.. ఆ ప్రమాదంలో 14 మంది చనిపోయారు.. కొట్టుకుపోయిన బ్రిడ్జి వల్ల రాకపోకలు బంద్ అయ్యాయి. లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే 16 కోట్ల రూపాయల బడ్జెట్‎తో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జి పూర్తయ్యింది.. రాకపోకలు జరుగుతున్నాయి. జస్ట్.. 16 రోజులు అంటే 16 రోజుల్లోనే.. ఇప్పుడు పడిన వర్షాలకు కొత్త బ్రిడ్జి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. 16 కోట్ల రూపాయల బ్రిడ్జి.. 16 రోజుల్లో కొట్టుకుపోవటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంత అద్భుతంగా.. ఇంత నాణ్యతతో ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన ఇంజినీర్లను గ్రేట్ ఇండియన్ కాంట్రాక్టర్స్ అంటూ చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. ఈ బ్రిడ్జి ఎక్కడ నిర్మించారు.. ఎందుకు కొట్టుకుపోయింది అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డెహ్రాడూన్‎లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో డెహ్రాడూన్‌లోని నందా కీ చౌకీ దగ్గర నూతనంగా నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో డెహ్రాడూన్-పాంటా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రూ.16 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిని 16 రోజుల క్రితమే ప్రారంభించడం గమనార్హం. ఓపెనింగ్ చేసిన 16 రోజుల్లోనే ఒకే ఒక్క వర్షానికి వర్షానికి 16 కోట్లతో నిర్మించిన వంతెన కుంగిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అధికారులు, కాంట్రాక్టర్లల అవినీతికి ఈ వంతెనే నిదర్శనమని విమర్శిస్తున్నారు ప్రజలు. కేవలం ప్రారంభించిన 16 రోజుల్లోనే బ్రిడ్జి డ్యామేజ్ కావడంతో దాని నాణ్యత, భద్రతపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వంతెన సురక్షితంగానే ఉందంటున్నారు అధికారులు. ఇటీవల కురిసిన భారీ కురిసిన వర్షాల వల్ల బ్రిడ్జి కింద ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో కొంచెం కుంగిందని తప్పును సమర్ధించుకుంటున్నారు. 

వాస్తవానికి 2026, ఏప్రిల్ 30న ఈ వంతెన ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిర్ణీత సమయంలోగా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో2026, జులై 12న ప్రారంభించారు. 2025, సెప్టెంబరులో వరదల్లో కొట్టుకుపోయి 14 మంది ప్రాణాలు కోల్పోయిన పాత బ్రిడ్జి స్థానంలో దీనిని నిర్మించారు. నూతనంగా నిర్మించిన వంతెన కూడా కేవలం ప్రారంభించిన 16 రోజుల్లోనే కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఈ ఘటనను జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ చౌహాన్ సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 14 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి కోసం మళ్లీ నాసిరకంగా బ్రిడ్జి నిర్మించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.