ఉద్యమకారుల గుర్తింపే లక్ష్యంగా అడుగులు.. ఉద్యమ కళాకారులందరికీ గౌరవ పురస్కారం

ఉద్యమకారుల గుర్తింపే  లక్ష్యంగా అడుగులు.. ఉద్యమ కళాకారులందరికీ గౌరవ పురస్కారం

దశాబ్దాలపాటు సాగిన  తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం సబ్బండ వర్గాల త్యాగాల పునాదుల మీద నిర్మితమైంది.  ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను,  భవిష్యత్తును పణంగా పెట్టి పోరాడారు.  అయితే,  ఎన్నో బలిదానాల  తర్వాత  సాకారమైన తెలంగాణ రాష్ట్రంలో.. తొలి ప్రభుత్వం ఆ ఆత్మగౌరవ పోరాట యోధులను,  క్షేత్రస్థాయి ఉద్యమకారులను  ఆశించినస్థాయిలో పట్టించుకోలేదనే ఒక బలమైన అసంతృప్తి పౌర సమాజంలో ఉండిపోయింది. ఆ చారిత్రక లోటును సరిదిద్దుతూ,  తెలంగాణ ఎవరి కోసమైతే ఏర్పడిందో  వారి  కోణంలోనే  పరిపాలన సాగాలనే  స్పష్టమైన లక్ష్యంతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'ప్రజా ప్రభుత్వం' అడుగులు వేస్తోంది.  

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూనే  డిసెంబర్ 9నే  గెలుపును ఉద్యమకారులకు అంకితం చేశారు  సీఎం రేవంత్ రెడ్డి.  అధికారంలోకి  వచ్చిన నాటినుంచి ఉద్యమకారుల  సంక్షేమం,  గుర్తింపునకు పెద్దపీట వేస్తూ వస్తున్న ఈ ప్రభుత్వం,  వారి త్యాగాలకు  నిజమైన నివాళి అర్పిస్తూ అనేక చారిత్రాత్మక  నిర్ణయాలు తీసుకుంటోంది. 

ఉద్యమకారులకు నామమాత్రపు సాయంచేసి చేతులు దులుపుకోకుండా, వారిని సంస్థాగతంగా గుర్తించి, సముచిత గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా జీఓ 679 ను విడుదల చేస్తూ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాజ్యసభ మాజీ సభ్యుడు,  సీనియర్ రాజకీయ నాయకుడు కె. కేశవరావు ఈ కమిటీకి  చైర్మన్‌‌‌‌గా  వ్యవహరిస్తున్నారు. కమిటీలో మిగిలిన సభ్యులను ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన వారినే నియమించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

  • ఉద్యమ కళాకారులందరికీ గౌరవ పురస్కారం

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో  ఇక్కడి కవులు,  కళాకారుల పాత్ర  అద్వితీయం. వారి ఆటలు,  పాటలే  ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి ఉద్యమాన్ని ఊరూరా విస్తరింపజేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గీతంగా కవి అందెశ్రీ రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతాన్ని  ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.  అంతేకాకుండా ఆయన సేవలకు గుర్తింపుగా ఏకంగా రూ. 1 కోటి నగదు బహుమతితోపాటు, 300 గజాల ఇంటి స్థలాన్ని  అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్వయంగా ఆ మహాకవి పాడెమోసి తన కృతజ్ణతను తెలియజేసిన తీరుకు యావత్  తెలంగాణ సమాజం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. 

ప్రజా ప్రభుత్వం కేవలం  అందెశ్రీకే  పరిమితం కాకుండా,  ప్రముఖ ప్రజా గాయకులు గూడ అంజయ్య,  ప్రజా యుద్ధనౌక గద్దర్,  బండి యాదగిరి,  గోరటి వెంకన్న, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాశం యాదగిరి, అలాగే గన్‌‌‌‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరి రావులకు సైతం ఒక్కొక్కరికి రూ. 1 కోటి నగదు బహుమతి, 300 గజాల ఇంటిస్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం.

  •  అస్తిత్వానికి దక్కిన గొప్ప గౌరవం

రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన రూపురేఖలు తీసుకొచ్చే క్రమంలో..  తెలంగాణ  రాష్ట్రానికే  తలమానికంగా ఉన్న 'తెలంగాణ తల్లి' విగ్రహానికి  రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక  గుర్తింపునిచ్చింది. ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేవలం రాష్ట్ర సచివాలయానికే  పరిమితం చేయకుండా,  రాష్ట్రంలోని  ప్రతి జిల్లా  కలెక్టరేట్లలోనూ  సగర్వంగా  ప్రతిష్ఠాపన చేయాలని నిర్ణయించడం అస్తిత్వానికి దక్కిన గొప్ప గౌరవం.    ఇల్లులేని  నిరుపేద  ఉద్యమకారులకు ఇందిరమ్మ ఇళ్ల కింద  సముచిత  ప్రాధాన్యత లభించే దిశగా  కసరత్తు చేస్తుంది. రాబోయే రోజుల్లో  కె. కేశవరావు కమిటీ ద్వారా ప్రతి ఒక్క ఉద్యమకారుడిని గుర్తించేలా చేసి, అందరికీ తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. 

  • అమరుల కుటుంబాలకు లభించిన గౌరవం

తెలంగాణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు, అలాగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు రాష్ట్ర మహిళా కమిషన్‌‌‌‌లో సభ్యులుగా అత్యున్నత అవకాశం కల్పించి వారికి సముచిత స్థానం కల్పించింది.  తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ పదవిని వదులుకున్న నళినికి తిరిగి ఉద్యోగ అవకాశం ఇవ్వచూపడం ద్వారా ప్రజా ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది. వినోద రంగానికి సంబంధించి గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో.. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక,  ప్రజా గాయకుడు  గద్దర్  పేరిట సినీ ప్రముఖులకు,  టెలివిజన్ కళాకారులకు అవార్డులను  ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళారంగంలో ఆయనకు శాశ్వత  గుర్తింపును తీసుకొచ్చింది. 

  • విస్తృత  సమావేశాలకు కమిటీ  ప్రణాళికలు

ఈ కమిటీ ఇప్పటికే తన కార్యకలాపాలను అత్యంత వేగంగా ప్రారంభించింది. మే 30న వివిధ వర్గాల ప్రతినిధులతో కమిటీ సమావేశాన్ని నిర్వహించి, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై ప్రాథమిక చర్చలు జరిపింది. అనంతరం జూన్ 4న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను, అమూల్యమైన సూచనలను స్వీకరించింది. గత ప్రభుత్వం అమరుల కోసం, ఉద్యమకారుల గుర్తింపు కోసం ఇలాంటి పనిని కనీసంగా సంకల్పించని చోట ఈ చర్యలు గొప్ప ఆశను కల్పిస్తున్నాయి. 

రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర  పోషించిన ఉస్మానియా, కాకతీయ తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలతో, ఇతర అన్ని ఉద్యమ సంఘాలతో రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు కమిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.  ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండి,  గుర్తింపునకు నోచుకోని ఏ ఒక్క నిజమైన ఉద్యమకారుడు కూడా మిగిలిపోకూడదనే లక్ష్యంతో  ప్రతి ఒక్కరినీ గుర్తించి ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటోంది. 

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
సీఈవో, టిసాట్ నెట్​వర్క్​

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.