Jewel Thief: పేపర్లో వచ్చిన ఓ క్రైం స్టోరీ.. 1.75 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది..!

Jewel Thief: పేపర్లో వచ్చిన ఓ క్రైం స్టోరీ.. 1.75 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది..!

మళయాళం సినిమా అంటే పడి చస్తున్నారు జనం.. పాటలు ఉండవు.. ఫైట్స్ ఉండవు.. డ్రామా అసలే ఉండదు.. సింపుల్ క్రైం స్టోరీలను ఆసక్తికరమైన కథగా మలుస్తూ.. సమాజంలో రోజూ జరుగుతున్న నేరాలు, ఘోరాలు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మళయాళం సినీ ఇండస్ట్రీ తీస్తున్న సినిమాలను ఎగబడి చూస్తున్నాం కదా.. ఇలాంటి ట్రైండ్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది? అని తెలుసుకుంటే షాక్ అవుతారు.. హిందీ సినీ ఇండస్ట్రీలో 1976లోనే.. బాలీవుడ్ సూపర్ స్టార్ దేవానంద్ తీసిన సినిమానే ట్రెండ్ సెట్టింగ్ అంటే నమ్మగలరా.. అవును.. అప్పట్లో ఓ హిందీ పత్రికలో వచ్చిన రియల్ క్రైం స్టోరీ ఆధారంగా.. ఆ జర్నలిస్టు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తెరకెక్కిన సినిమానే అది.. ఈ స్టోరీ కథ ఏంటో తెలుసుకుందామా..

క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్గా ‘జ్యువెల్ థీఫ్’ (Jewel Thief): 

1967లో విడుదలైన ‘జ్యువెల్ థీఫ్’- ఇండియన్ సినీ చరిత్రలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. బాలీవుడ్ టాప్ హీరో దేవ్ ఆనంద్, వైజయంతిమాల జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు.

అయితే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..‘ఈ సినిమా కథ ఓ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కథనం నుంచి’ ప్రేరణ పొందింది. ఈ మూవీలో తాను చేయని ఆభరణాల దొంగతనాల కేసులో చిక్కుకున్న వ్యక్తిగా దేవ్ ఆనంద్ అద్భుత నటన కనబరిచారు. ఉత్కంఠభరితమైన కథతో పాటు ‘యే దిల్ నా హోతా బెచారా’ వంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కూడా సినిమాను క్లాసిక్‌ హిట్గా నిలబెట్టింది. 

అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఈ మూవీ వెనుక దాగుంది. ఈ చిత్రంలోని కీలక పాత్రలో నటించిన నటుడు అశోక్ కుమార్ తొలుత సినిమాని రిజెక్ట్ చేశారు. అతనుకి జరిగిన హార్ట్ సర్జరీ వల్ల తలెత్తిన హెల్త్ ఇస్యూస్ కారణంగా ఆయన వెనక్కి తగ్గినా, దేవ్ ఆనంద్ వ్యక్తిగతంగా ఒప్పించడంతో చివరికి సినిమాలో నటించారు. ఈ ఒక్కసినిమాతోనే టాప్ నటులలో ఒకరిగా నిలిచారు.

రూ.1.75 కోట్ల బడ్జెట్.. రూ.3.5 కోట్ల కలెక్షన్స్..

క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీని సుమారు రూ.1.75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్తో, ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ‘జ్యువెల్ థీఫ్’ రిలీజ్ తర్వాత రూ.3.5 కోట్ల వసూళ్లు సాధించి అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం IMDbలో 7.9 రేటింగ్తో నిలిచిన ఈ చిత్రం, ఇవాల్టీకి సినీ ఆడియన్స్ తప్పక చూడాల్సిన క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచి గుర్తింపు పొందుతోంది.

‘జ్యువెల్ థీఫ్’ గురించి మరిన్ని విశేషాలు..

స్టోరీ బ్యాక్ డ్రాప్:

ఈ సినిమాలో హీరో వినయ్ (దేవ్ ఆనంద్) ఒక గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటాడు. తాను చేయని నేరాలకు, ముఖ్యంగా వరుసగా జరుగుతున్న ఖరీదైన దొంగతనాలకు తానే కారణమనే అపోహలో పడతాడు. అసలు ఆ దొంగతనాల వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? హీరో ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇందులో దేవ్ ఆనంద్ డ్యూయల్ రోల్ తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తారు.

ఎవర్ గ్రీన్ సాంగ్స్: ఈ చిత్రానికి ఎస్.డి. బర్మన్ సంగీతం అందించగా, మజ్జ్రూహ్ సుల్తాన్‌పురి పాటలు రాశారు. ‘యే దిల్ నా హోతా బెచారా’, ‘హొటోన్ పే ఐసీ బాత్ మెయిన్ దబా కే చలీ’, ‘రాత్ అకేలీ హై’ వంటి పాటలు.. ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

సినిమా విశేషాలు: నవ్ కేతన్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. ఆ కాలంలోనే కెమెరా పనితనం, టర్నింగ్ పాయింట్లు, ట్విస్టులు ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి.

సినిమా ఇంపార్టెన్స్: బాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల చరిత్రలో ‘జ్యువెల్ థీఫ్’ ఒక మైలురాయిగా నిలిచింది. నేటి మోడరన్ క్రైమ్ థ్రిల్లర్స్‌కు, సస్పెన్స్ సినిమాలకు అప్పట్లోనే ఈ చిత్రం ఒక రోడ్‌మ్యాప్‌గా నిలిచిందని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తూ వస్తున్నారు.