హాస్టల్స్‌లో విద్యార్థుల వస్తువులు పోతే... ఇకపై బాధ్యత పూర్తిగా యజమానులదేనని కూకట్ పల్లి జోన్ డిసిపి రితిరాజ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో హాస్టళ్లలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా లాప్‌టాప్‌లు, బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్లు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయన్నారు. చాలా హాస్టల్స్ కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదు. హాస్టళ్లలోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారు? అనే కనీస సమాచారం కూడా రికార్డు చేయడం లేదన్నారు.
తాము నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో చాలా లొసుగులు బయటపడ్డాయని, పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఇకపై హాస్టళ్లలో దొంగతనాలు జరిగితే... కేవలం దొంగలపైనే కాకుండా, యజమానుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ప్రతి హాస్టల్ యాజమాన్యం విధిగా సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిందేనని సూచించారు. సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. హాస్టల్ నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే తమతో పంచుకోవాలని, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిసిపి హెచ్చరించారు.
►ALSO READ | పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
