IND vs ZIM: జింబాబ్వే పర్యటనను భారత జట్టు సక్సెస్ ఫుల్ గా ముగించింది. చివరి టీ20 మ్యాచ్‌లోనూ 35 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3–0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసేసింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ తీసుకోగా, ఓపెనర్ అభిషేక్ శర్మ (2) విఫలమైనప్పటికీ, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 192/5 భారీ స్కోరు చేయగా, ఆ టార్గెట్ ని ఛేజ్ చేయలేక జింబాబ్వే చేతులెత్తేసింది.
బౌలర్లకు నిద్రలేకుండా చేసిన వైభవ్:
ఈ మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే బౌలర్లకి నిద్రలేకుండా చేశాడు. కేవలం 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 81 పరుగులు చేసి ఇండియా భారీ స్కోరు చేయగానికి గట్టి పునాది వేశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీ దాటించడానికే ఈ 15 ఏళ్ల కుర్రాడు చూశాడు. వైభవ్ బ్యాటింగ్ చూసిన జింబాబ్వే బౌలర్లు, బంతి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు.
ఒంటరి పోరాటం చేసిన ర్యాన్ బర్ల్:
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టులో ర్యాన్ బర్ల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో కాస్త పోరాడాడు. కానీ నువ్వు ఒక్కడివే ఆడు, మేమంతా పెవిలియన్‌లో విశ్రాంతి తీసుకుంటాం అన్నట్లు మిగతా బ్యాటర్లంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ కి క్యూ కట్టారు. బర్ల్‌కి సరైన సహకారం అందించే నాథుడే కరువయ్యాడు. చివరికి జింబాబ్వే 20 ఓవర్లలో 157/7 పరుగులకే పరిమితమై, సొంతగడ్డపై సిరీస్‌ను 0–3తో సమర్పించుకుంది.
అంతుకుముందు భారత్ బ్యాటింగ్:
ఈ మూడో మ్యాచ్‌లో వైభవ్ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ (29), శ్రేయస్ (27), తిలక్ (11), రింకు సింగ్ (25) బాధ్యతయుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక జింబాబ్వే ఓటమికి ప్రధాన కారణం భారత బౌలర్లు.. మయాంక్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగగా, యశ్ ఠాకూర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
