స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన సోమవారం: లాభాలతో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!

స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన సోమవారం: లాభాలతో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!

ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఈ రోజు సోమవారం(జులై 27)న  మన దేశ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దింతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా దూసుకెళ్ళగా, నిఫ్టీ మళ్లీ 23,900 మార్కును అందుకుంది.

ఉదయం స్టాక్ మార్కెట్  సెన్సెక్స్ 549.21 పాయింట్లు (0.72%) లాభపడి 76,608.98 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. నిఫ్టీ 160.95 పాయింట్లు (0.68%) పెరిగి 23,928.40 వద్దకు చేరింది.

అన్ని రంగాలూ లాభాల్లో..
స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అన్ని రంగాల షేర్లు గ్రీన్ జోన్లో ట్రేడవుతున్నాయి. టాప్ గెయినర్స్ లో  నిఫ్టీ మిడ్‌స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (1.29%), నిఫ్టీ ఐటీ (1.25%), నిఫ్టీ మీడియా (1.06%), నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ (1%) చొప్పున లాభపడ్డాయి.

ఇతర రంగాలు చూస్తే ఆటో, కెమికల్స్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు కూడా 0.70% నుంచి 0.80% వరకు లాభాలతో కొనసాగుతున్నాయి.

మార్కెట్ లాభాలకు అసలు కారణం ఏంటంటే ?
తగ్గిన చమురు ధరలు: నాలుగు రోజుల క్రితం 102 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర, సోమవారం ఉదయానికి 93 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ 7% పైగా తగ్గి బ్యారెల్‌కు 91 డాలర్ల వద్ద, WTI క్రూడ్ 85 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఇది మార్కెట్‌కు ఎంతో ఊరటనిచ్చింది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం... మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గి, చమురు ధరలు ఇంకా తగ్గితే మార్కెట్‌లో ఈ జోరు మరింత కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, గ్లోబల్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), చిప్ స్టాక్స్ ట్రెండ్ వల్ల విదేశీ ఇన్వెస్టర్లు (FPIs) మళ్లీ మన దేశ మార్కెట్ వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.

ఆసియా మార్కెట్ల పరిస్థితి
ఇతర ఆసియా దేశాల మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ (నిక్కీ), హాంకాంగ్ (హాంగ్ సెంగ్) మార్కెట్లు లాభాల్లో ఉండగా.. దక్షిణ కొరియా (కోస్పి) మార్కెట్ మాత్రం సుమారు 1 శాతం నష్టంతో ట్రేడవుతోంది.

సోమవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టడంతో, చాలా కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాలు అద్భుతమైన ప్రారంభాన్ని అందుకున్నాయి.

టాప్ గెయినర్స్ :

ఇన్ఫోసిస్,  బజాజ్ ఫైనాన్స్ షేర్లు చెరో 2.17% లాభపడి ముందు వరుసలో నిలిచాయి. ఏషియన్ పెయింట్స్ 1.69%, టీసీఎస్ 1.42%, టెక్ మహీంద్రా 1.37% పెరిగాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్ (రెండూ 1.28%), మారుతి సుజుకి (1.25%) చొప్పున లాభపడ్డాయి. టాటా స్టీల్, ఎల్&టి (0.99%), ఐటీసీ (0.97%), ట్రెంట్ (0.91%) షేర్లు కూడా గ్రీన్ జోన్‌లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి.

బ్యాంకింగ్, ఇతర దిగ్గజ షేర్లు:

మహీంద్రా & మహీంద్రా 0.88%, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.73%, అల్ట్రాటెక్ సిమెంట్ 0.72% లాభపడ్డాయి. బీఈఎల్ (0.68%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (0.62%), ఎటర్నల్ (0.61%) లాభాలతో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ (చెరో 0.56%) మంచి  పర్ఫార్మెన్స్  కనబరిచాయి. యాక్సిస్ బ్యాంక్ (0.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.46%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.44%), ఎస్బీఐ (0.41%) లాభాల్లో కొనసాగుతున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ (0.37%), టైటాన్ (0.28%), పవర్ గ్రిడ్ (0.24%) షేర్లు కూడా స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

నష్టపోయిన ఏకైక షేర్:

మార్కెట్ మొత్తం లాభాల్లో దూసుకెళ్తున్నప్పటికీ, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ షేరు మాత్రం కేవలం 0.01% అతిస్వల్ప నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది.