లివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

లివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

అన్నీ కావాలి కానీ పెళ్లి మాత్రం వద్దు అనే ధోరణిని ఆయన తప్పుపట్టారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. కాలం మారింది కదా అని ప్రశ్నిస్తూ.. లివ్-ఇన్ రిలేషన్స్ వల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటని నిలదీశారు. ధర్మం వైపు ఉండాలి అనుకునే వారికి పెళ్లి పద్ధతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే, ఎల్జీబీటీక్యూ (LGBTQ) వర్గానికి చెందిన వారిని ఈ సమాజం వేరుగా చూడకూడదని హితవు పలికారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'విశ్వమాంగల్య సభకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికగా ఆయన కుటుంబ వ్యవస్థ, మాతృత్వం, ఆధునిక పోకడలు, ధర్మంపై  మాట్లాడారు.  మనం భాష, రూపం, వేషం పరంగా వేర్వేరు అయినప్పటికీ.. ధర్మం విషయంలో, ఆత్మగా అందరం ఒకటేనని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. ధర్మాన్ని పాటించని మనిషి పశువుతో సమానమని హెచ్చరించారు. బ్రహ్మచారిగా ఉండేవారికి ప్రత్యేక నియమాలు ఉంటాయని, పెళ్లి చేసుకున్నవారికి నిబంధనలు వేరే ఉంటాయని ఆయన అన్నారు.

 సృష్టి నిర్మాణం దగ్గరి నుంచి మాతృత్వం నిరంతరం నడుస్తోందని, తల్లుల దగ్గర యుగాల అనుభవం ఉంటుందని మోహన్ భగవత్ కొనియాడారు. పురుషులు, మహిళలకు అన్ని ఉద్వేగాలు సమానంగా ఉన్నప్పటికీ.. కేవలం మహిళలకు మాత్రమే దక్కిన గొప్ప వరం మాతృత్వమని స్పష్టం చేశారు. కుటుంబ నిర్వహణ అనేది మహిళ ప్రధాన బాధ్యత అని అభిప్రాయపడ్డారు. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పనులను గతంలో బ్రిటిష్ వారు చేశారని, కాలంతో పాటు మారాలి అంటారు సరే.. కానీ సమాజంలో వస్తున్న మార్పులను బేరీజు వేసుకోవాలని సూచించారు.

మనం ఒకవైపు స్త్రీలను దేవి అని కొలుస్తూనే, మరోవైపు వారిని 'దాసి'లా మార్చేశామని మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ స్త్రీ కూడా దాసిలా బతకాలని అనుకోదని, తనలాగే సమానంగా ఉండాలని కోరుకుంటుందని అన్నారు. బంధాల నుంచి ఎప్పుడూ ముక్తి పొందాలని అనుకోకూడదని, కుటుంబ బంధాలను అందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.