కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!

కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలకే ఎక్కువగా ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  కొరియన్ సినిమాలు, డ్రామాలు (K-Drama తెలుగువారిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువతలో K-డ్రామాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మరిన్ని కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

K-డ్రామాలకు తెలుగోళ్ల క్రేజ్..

దేశంలో కొరియన్ కంటెంట్‌ను అత్యధికంగా వీక్షిస్తున్న వారిలో తెలుగు ప్రేక్షకులు ముందంజలో ఉన్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా వెల్లడించింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల కంటెంట్‌ను కూడా విస్తృతంగా చూస్తుండటంతో.. K-డ్రామాలకు మంచి ఆదరణ లభిస్తోందని సంస్థ తెలిపింది. సబ్‌టైటిల్స్ చదవకుండా సొంత భాషలో చూసే అవకాశం కల్పిస్తే మరింత మంది ప్రేక్షకులు ఈ కంటెంట్‌ను ఆస్వాదిస్తారని భావిస్తోంది.

 ప్రతి నెలా ఒక కొత్త K-డ్రామాతో..

ఈ నేపథ్యంలో కొరియాకు చెందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ CJ ENMతో అమెజాన్ ప్రైమ్ వీడియో బహువార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో రానున్న రెండేళ్లలో 100కు పైగా కొరియన్ టైటిల్స్ భారత ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు ప్రతి నెలా ఒక కొత్త K-డ్రామా లేదా సినిమా విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు.

►ALSO READ | ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!

ఇటీవలి కాలంలో 'Squid Game', 'Crash Landing on You', 'Queen of Tears', 'Business Proposal', 'Goblin' వంటి K-డ్రామాలు భారతదేశంలో భారీ అభిమాన వర్గాన్ని సంపాదించాయి. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వస్తే ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ భావిస్తున్నాయి... మొత్తానికి.. కొరియన్ కథలకు తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడం.. భారత డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారుతోంది.