ఒకప్పుడు విద్య అంటే జ్ఞాన సముపార్జన, సంస్కారవంతమైన జీవనానికి పునాది. కానీ, నేడు విద్యారంగం పూర్తిగా వ్యాపారీకరణ వైపు మళ్ళింది. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో విద్యాసంస్థలు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలుగా కాకుండా, అడ్మిషన్ల వేటలో నిమగ్నమైన కార్పొరేట్ సంస్థలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ ధోరణి విద్యా ప్రమాణాలను, ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని, చివరికి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు పరిశోధనలకు పట్టుగొమ్మలుగా ఉన్నాయి.
కానీ, ప్రైవేట్ విద్యాసంస్థల పరిస్థితి చూస్తే, అవి కేవలం 'డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు'గా మాత్రమే మిగిలిపోయాయి. విద్యాశాఖ నిబంధనలు ఉన్నప్పటికీ చాలా సంస్థలు అఫిలియేషన్ల సమయంలోనే నిబంధనలు పాటిస్తున్నట్లు నటిస్తాయి. తనిఖీలు మొక్కుబడిగా మారడం వల్ల ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు ఉండటం లేదు. విద్యారంగం అభివృద్ధి చెందాలంటే పరిశోధన అత్యంత కీలకం.
ప్రభుత్వ విద్యాసంస్థలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిరంతరం పరిశోధనల్లో నిమగ్నమై సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను అందిస్తున్నాయి. కానీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో పరిశోధనా సంస్కృతి నామమాత్రంగానే ఉంది. యాజమాన్యాలు దీన్ని 'అవసరం లేని ఖర్చు'గా భావించడం వల్ల, దేశం మేధోసంపత్తిలో వెనుకబడుతోంది. అధ్యాపకులపై పనిభారం, అడ్మిషన్ల ఒత్తిడి కారణంగా వారు కేవలం సమాచారాన్ని బట్టీ పట్టించే యంత్రాలుగా మారుతున్నారు తప్ప జ్ఞాన సృష్టికర్తలుగా ఎదగలేకపోతున్నారు.
పరిశోధనా వాతావరణం లేకపోవడంతో ప్రతిభావంతులైన అధ్యాపకులు ప్రభుత్వ సంస్థలకు లేదా విదేశాలకు వలస వెళ్తున్నారు. నేడు ప్రైవేట్ విద్యాసంస్థల ప్రధాన అజెండా 'బోధన' కాదు, కేవలం 'అడ్మిషన్లు' మాత్రమే. మే నెల రాగానే కళాశాల యాజమాన్యాలు పాఠాల కంటే, విద్యార్థులను ఎలా ఆకర్షించాలి? అడ్మిషన్లు ఎలా పెంచుకోవాలి? అనే వ్యూహాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకులను సైతం కరపత్రాలు పంచే 'సేల్స్ ఏజెంట్లు'గా మార్చడం విద్యావ్యవస్థలోని విషాదకరమైన కోణం. తరగతి గదుల్లో కొత్త ఆవిష్కరణల గురించి చర్చ జరగాల్సినచోట, ఫీజుల వసూలు, మార్కెటింగ్ టార్గెట్లపై సమీక్షలు జరగడం విచారకరం.
- వృథా ఖర్చుగా భావిస్తున్న యాజమాన్యాలు
పరిశోధన చేయని అధ్యాపకుడు కేవలం పుస్తకాల్లోని సమాచారాన్ని మాత్రమే చెప్పగలడు. పరిశోధన చేయడం వల్ల వచ్చే అనుభవం విద్యార్థులకు అందడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆశిస్తాయి. పరిశోధన అనేది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ, దీనికి భారీ పెట్టుబడి అవసరం, కానీ తక్షణ ఫలితాలు ఉండవు. అందుకే యాజమాన్యాలు దీన్ని వ్యర్థమైన ఖర్చుగా భావిస్తాయి. ప్రభుత్వ గ్రాంట్లు ప్రధానంగా ప్రభుత్వ సంస్థలకే దక్కుతాయి.
ప్రైవేట్ సంస్థలు సొంతంగా పరిశోధనా నిధులు కేటాయించడం చాలా తక్కువ. పరిశోధనలకు అవసరమైన 'ఇండస్ట్రీ- అకాడెమియా లింకేజ్' ప్రైవేట్ రంగంలో చాలా బలహీనంగా ఉంది. పరిశ్రమలు ఇచ్చే ప్రాజెక్టులు ఇక్కడ తక్కువ స్థాయిలో ఉండటం ఒక కారణం. ప్రైవేట్ సంస్థలు పరిశోధనలకు దూరంగా ఉండటం వల్ల దేశం అంతర్జాతీయ పేటెంట్ రేసులో వెనుకబడిపోతోంది. యాజమాన్యాలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల కంటే, తక్కువ జీతాలకు పనిచేసే వారిని నియమించుకుని, అడ్మిషన్ల ప్రచారానికి వారిని ఎక్కువగా వాడుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉన్నట్లుగా పరిశోధనా సంస్కృతి ప్రైవేట్ రంగంలో లేకపోవడానికి ప్రధాన కారణం సమయం లేకపోవడం. అధ్యాపకులు అడ్మిషన్ల డ్యూటీలలో బిజీగా ఉండటం వల్ల కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించే అవకాశం ఉండటం లేదు.
- పక్కతోవ పడుతున్న విద్యాబోధన
ప్రభుత్వ అధ్యాపకులు, ప్రైవేట్ అధ్యాపకుల విద్యార్హతలలో కూడా చాలా వ్యత్యాసం ఉండటం కూడా ప్రైవేట్ విద్యాసంస్థలలో రీసెర్చ్ కనుమరుగు అవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ అధ్యాపకుడిగా నియమించాలంటే పీహెచ్డీ, నెట్, సెట్, మినిమమ్ రీసెర్చ్ పేపర్స్ లాంటి అర్హతలుండాలి. అదే ప్రైవేట్ అధ్యాపకుడిగా నియమించటానికి కేవలం పీజీ పట్టా ఉంటే చాలు. ఇక్కడే విద్యా బోధన పక్కతోవ పడుతోంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో రీసెర్చ్ అనుభవం ఉన్న అధ్యాపకులు చాలా అరుదుగా కనిపిస్తారు ఒకవేళ ఉన్నా వారికి నాన్ అకడమిక్ పనుల్లో ఉపయోగించి పరిశోధనలపై ఆసక్తి తగ్గేలా చేయడం జరుగుతుంది.
విద్యా వ్యవస్థలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఒక శాపంగా మారింది. ప్రతి బీదవాడు చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజ్ రీయింబర్స్మెంట్ సకాలంలో అందక ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలను అమలుచేయటం లేదు. అన్ని లోపాలకు యాజమాన్యాలు ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడమే కారణంగా చూపడం గమనార్హం. ప్రభుత్వం కూడా విద్యార్థుల హాజరు, అర్హులైన అధ్యాపకులు, ల్యాబ్ సౌకర్యాలు, పరిశోధన సౌకర్యం లాంటి ప్రమాణాలను పాటించే విద్యాసంస్థలకు బకాయిలు పెట్టకుండా విద్యాసంవత్సరం ముగిసేలోపే ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
- నిరంతర నిఘా పెట్టి రేటింగ్ ఇవ్వాలి
యూనివర్సిటీలు కూడా తనిఖీలు కేవలం విద్యా సంవత్సరం ఆరంభ సమయానికే పరిమితం చేయకుండా నిరంతర నిఘా పెట్టి రేటింగ్ ఇవ్వాలి. అప్పుడే విద్యా ప్రమాణాలలో నాణ్యత పెరిగి విద్యార్థులకు లాభం చేకూరుతుంది. విద్యాసంస్థలు ఉద్యోగులను తయారుచేసే కర్మాగారాలు కాదు. అవి సమాజ గమనాన్ని మార్చే ఆవిష్కరణల కేంద్రాలు కావాలి. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం కేవలం ఆమోదాలకే పరిమితం కాకుండా, విద్యాసంస్థల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేయాలి.
అధ్యాపకులను కేవలం బోధనకే పరిమితం చేసేలా నిబంధనలు అమలు చేయాలి. ప్రైవేట్ సంస్థల్లోని పరిశోధనలను ప్రోత్సహించడానికి ప్రత్యేక గ్రాంట్లు, పన్ను మినహాయింపులు కల్పించాలి. కేవలం అడ్మిషన్ల సంఖ్య ఆధారంగా కాకుండా, ఆ సంస్థలోని పరిశోధనలు, నాణ్యమైన బోధన ఆధారంగానే రేటింగ్స్ ఇవ్వాలి. విద్య అనేది వ్యాపారం కాదు, అదొక సామాజిక బాధ్యత. ఈ స్పృహ విద్యా సంస్థల యాజమాన్యాల్లో వచ్చినప్పుడే, మన విద్యావ్యవస్థ నిజమైన అర్థంలో 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ'గా మారుతుంది.
- డా. ఎండి ఖ్వాజా మొయినొద్దీన్
సోషల్ ఎనలిస్ట్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
