ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) హ్యాకింగ్ గురైనట్లు తెలుస్తుంది. ఒక హ్యాకర్ గ్రూప్ బ్యాంకు సిస్టమ్‌లను హ్యాక్ చేసి, ఏకంగా 1 టెరాబైట్ (1TB) డేటాను డార్క్ వెబ్‌లో ఫ్రీగా లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కస్టమర్ల పర్సనల్ వివరాలతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది కస్టమర్ల ఆధార్ నంబర్లు, పేర్లు, ఫోన్ నంబర్లు ఇంకా లోన్ వివరాలు బయటికి వచ్చాయి.
అసలు ఏం జరిగిందంటే... ఈ డేటా ఉల్లంఘనపై వార్తలు రావడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హ్యాకింగ్ దాడిలో బ్యాంకింగ్ సిస్టమ్ ఏదీ హ్యాక్ కాలేదని, కేవలం ఒక ఉద్యోగి ఈమెయిల్ అకౌంట్ మాత్రమే హ్యాక్ అవ్వడం వల్ల కొంత డేటా బయటికి వెళ్ళిందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించి చర్యలు చేపట్టామని, ప్రస్తుతం సైబర్ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.
లీకైన డేటాలో ఏముందంటే
'క్యాష్‌లెస్ కన్స్యూమర్' వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ ఈ లీక్‌కు సంబంధించిన సాంపుల్స్ Xలో షేర్ చేశారు. ఆయన పరిశీలన ప్రకారం లీకైన డేటాలో కస్టమర్ల సేవింగ్స్, కరెంట్ అకౌంట్ రికార్డులు, ఆధార్ నంబర్లు, పేర్లు, వ్యక్తిగత ఇంకా కార్పొరేట్ బ్యాంకింగ్ వివరాలు, వివిధ శాఖలకు సంబంధించిన లోన్ అప్లికేషన్లు, ఆడిట్ రిపోర్టులు, ఎన్ఆర్ఐ (NRI) కస్టమర్ల వివరాలు, ఏటీఎం అలాగే బ్రాంచ్ సంబంధిత పేపర్స్ ఉన్నాయి.
►ALSO READ | మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా.. ఆగస్టు నుండి మారనున్న 7 రూల్స్ ఇవే..
ఈ హ్యాకింగ్ వెనుక ఎవరు
ఈ హ్యాకింగ్ దాడికి ఇప్పటివరకు ఏ ప్రత్యేక హ్యాకర్ గ్రూప్ కూడా నేరుగా బాధ్యత ప్రకటించలేదు. అయితే, ఈ ఏడాది మే నెలలో ఇండోనేషియా బ్యాంక్‌ను హ్యాక్ చేసిన 'ట్రిపుల్ఎక్స్' (TripleX) అనే కొత్త హ్యాకింగ్ గ్రూప్ పనే అయి ఉండవచ్చని సైబర్ నిపుణులు అనుమానిస్తున్నారు. బ్యాంకింగ్ సిస్టమ్స్ సురక్షితంగా ఉన్నాయని బ్యాంక్ చెబుతున్నప్పటికీ, కస్టమర్ల ఆధార్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు లీక్ కావడం బ్యాంకింగ్ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీనిపై రిజర్వ్ బ్యాంక్ లేదా సంబంధిత భద్రతా సంస్థల (CERT-In) నుండి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
