లిక్విడ్ సబ్బా లేక సాధారణ సబ్బా ? ఏది వాడితే మీ చర్మనికి మంచిదంటే...

 లిక్విడ్ సబ్బా లేక సాధారణ సబ్బా ?  ఏది వాడితే మీ చర్మనికి మంచిదంటే...

ప్రతిరోజు అందరు వాడే అత్యంత ముఖ్యమైన వస్తువుల్లో సబ్బు ఒకటి. అయితే, ద్రవ సబ్బు (లిక్విడ్ సోప్) వాడటం మంచిదా లేక మామూలు సబ్బు (బార్ సోప్) వాడటం మంచిదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. రెండూ కూడా చర్మంపై ఉన్న మురికిని, చెమటను ఇంకా  క్రిములను తొలగించే పనే చేస్తాయి. కానీ వాటి తయారీ, ధర,  ప్రభావం, చర్మానికి సరిపోయే విధానంలో కొన్ని తేడాలు ఉన్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా.....

1. ద్రవ సబ్బు (Liquid Soap) ప్రయోజనాలు, నష్టాలు
పబ్లిక్ బాత్ రూమ్ లు, ఆఫీసులు ఇంకా ఇళ్లలో చాలా మంది ఒకే సింక్ దగ్గర సబ్బు వాడాల్సి వచ్చినప్పుడు లిక్విడ్ సోప్ ఎక్కువగా వాడుతుంటారు.

దీని వల్ల ప్రయోజనాలు ఏంటంటే డిస్పెన్సర్ ద్వారా సబ్బు వస్తుంది కాబట్టి, చాలా మంది చేతులు తాకాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల క్రిములు ఒకరి నుంచి మరొకరికి త్వరగా అంటవు. ఇందులో చర్మాన్ని పొడిబారకుండా మృదువుగా ఉంచే తేమ పదార్థాలు (Moisturizers) ఎక్కువగా ఉంటాయి. సువాసనలు తక్కువగా ఉండే లిక్విడ్ సోప్స్ పొడి చర్మం లేదా సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా మంచిది. పిల్లలు ఇంకా  పెద్దలు ఎవరైనా దీన్ని చాలా ఈజీగా  వాడవచ్చు.

నష్టాలు చూస్తే.. సాధారణ సబ్బుతో పోలిస్తే ద్రవ సబ్బుల ధర ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్లాస్టిక్ సీసాలు లేదా ప్యాకెట్లలో వస్తాయి కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువవుతాయి. కొన్ని రకాల ద్రవ సబ్బుల్లో చర్మానికి హాని చేసే ప్రిజర్వేటివ్స్ లేదా కృత్రిమ రంగులు, ఎక్కువ సువాసనలు ఉండవచ్చు.

2. సాధారణ సబ్బు (Bar Soap) ప్రయోజనాలు, నష్టాలు
చాలా ఏళ్లుగా మన ఇళ్లలో సాధారణంగా వాడుతున్న పద్ధతి బిళ్ళ సబ్బు. ఇది చౌకగా లభిస్తుంది ఇంకా ఎక్కువ కాలం వస్తుంది.

దీని వల్ల ప్రయోజనాలు చూస్తే దీని ధర చాల తక్కువ. ఇంకా సబ్బు చాలా కాలం పాటు వస్తుంది. వీటికి ప్లాస్టిక్ డబ్బాలు అవసరం లేదు. కేవలం కాగితం లేదా అట్టపెట్టెల్లో చుట్టి వస్తాయి కాబట్టి పర్యావరణానికి పెద్దగా హాని చేయదు. సరిగ్గా వాడితే ఇది చర్మాన్ని చాలా బాగా శుభ్రపరుస్తుంది. సున్నితమైన చర్మం కోసం సహజ సిద్ధమైన పదార్థాలతో తయారైన మంచి బార్ సోప్స్ కూడా మార్కెట్లో  లభిస్తున్నాయి.

దీని వల్ల నష్టాలు.. సబ్బు తడిగా ఉన్నప్పుడు నీళ్లలో నాని మెత్తబడి త్వరగా అరిగిపోతుంది. సబ్బు పెట్టెలో నీరు ఉంటె సబ్బు త్వరగా పాడైపోతుంది. అందువల్ల నీరు కారిపోయేలా ఉండే సబ్బు పెట్టె వాడాలి. కొన్ని రకాల సబ్బుల్లో క్షార గుణం (pH) ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి ఎక్కువసార్లు వాడితే చర్మం పొడిబారే అవకాశం ఉంది.

3. నిపుణులు ఎం  సిఫార్సు చేస్తున్నారంటే 
చర్మవ్యాధి నిపుణుల ప్రకారం.. ద్రవ సబ్బు లేదా బిళ్ళ సబ్బు.. ఏది వాడినా రెండూ శుభ్రత విషయంలో సమానంగానే పనిచేస్తాయి. ఏది బెస్ట్ ఆనేది మీ చర్మం రకాన్ని బట్టి ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి  తేమను ఇచ్చే ద్రవ సబ్బులను వాడటం మంచిది. సాధారణ చర్మం ఉన్నవారికి  మంచి నాణ్యమైన బిళ్ళ సబ్బును ధైర్యంగా వాడవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారికి  ఘాటైన వాసనలు, రసాయనాలు లేని సున్నితమైన సబ్బులను వాడటం మంచిది. 

ఏది బాగా శుభ్రపరుస్తుందంటే 
శుభ్రపరిచే విషయంలో ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఎం లేదు. మీరు ఏ సబ్బు వాడినా సరే, నీళ్లతో చేతులు లేదా శరీరాన్ని తడిపి, సబ్బు రాసుకుని కనీసం 20 సెకన్ల పాటు బాగా రుద్దుకుని కడిగితే చాలు.. మురికి, బ్యాక్టీరియా, వైరస్‌లు పూర్తిగా తొలగిపోతాయి.

చివరగా.. సబ్బు ఏ రకమైనదన్నది ముఖ్యం కాదు.. మీరు దానిని కడుక్కునే పద్ధతి, శుభ్రం చేయడానికి కేటాయించే సమయం అలాగే పరిశుభ్రత పాటించడమే ముఖ్యం!

►ALSO READ | వాస్తు దోషాలకు చెక్.. నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!