హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ సిటీలో భారీవర్షం కురిసింది. శుక్రవారం (జూన్12) రాత్రి ఉరుములు, మెరుపులతో సిటీవ్యాప్తంగా జోరువాన కురవడంతో జనజీవనం స్తంభించింది. రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శంషాదబాద్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఢిల్లీ నుంచి  హైదరాబాద్ కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విమానం ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. వాతావరణ అనుకూలించకపోవడంతో ATC అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతించలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్ళించారు.    

శుక్రవారం రాత్రి 9గంటలనుంచి సిటీ వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం లో భారీ వర్షం కురిసింది. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ఉరుములతో కూడిన వర్షం పడింది. నిజాంపేట్ , బాచుపల్లి, ప్రగతినగర్ లో మోస్తరు వాన కురిసింది. 

కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్ మచ్చ బొల్లారంలో వర్షం బీభత్సం  సృష్టించింది. నార్సింగి, మణికొండ, పుప్పాలగూడలో వాన దంచికొట్టింది. బండ్లగూడ జాగీర్, కిస్మత్ పురా ,హిమాయత్ సాగర్ లో మోస్తరు వర్షం పడింది. నాంపల్లి, అబిడ్స, కోఠి, బషీర్ బాగ్ లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది.  భారీ వర్షం కారణంగా వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.