తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నటరాజన్ వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని పేర్కొంది. 2026 జూన్ 12న పిటిషన్ విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ లతో కూడిన బెంచ్.. పిటిషన్ ను డిస్మిస్ చేశారు.
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ బుధవారం (2026 జూన్ 10) సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయగా.. క్రిమినల్ కేసు దాచినట్లు ఆరోపిస్తూ ఎన్నికల అధికారి నామినేషన్ తిరస్కరించారు. దీనిపై ఆమె సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. తెలంగాణలో అసలు క్రిమినల్ కేసే లేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పిటిషన్లో పేర్కొంది.
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్.. ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చానని .. తను ఎలాంటి సమాచారం దాచలేదని.. ఎలాంటి క్రిమినల్ కేసు కూడా లేదని అన్నారు. ఫామ్ 26లో నోటీసుల గురించి ఎక్కడా ప్రస్థావన లేదన్నారు. కేవలం కేసుల వివరాలు మాత్రమే చెప్పాలని ఫామ్ 26 లో ఉందని గుర్తు చేశారు. ఫామ్ 26 లో అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని అన్నారు. కాలమ్ లేనందునే లీగల్ నోటీసుపై వివరాలు ఇవ్వలేద స్పష్టం చేశారు. కేసు విచారణలో ఉందని.. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
