Vincent Pastore: ఉన్నట్టుండి ఇంట్లో మృతదేహంగా.. ప్రముఖ స్టార్ నటుడి మరణంపై అనుమానాలు!

Vincent Pastore: ఉన్నట్టుండి ఇంట్లో మృతదేహంగా.. ప్రముఖ స్టార్ నటుడి మరణంపై అనుమానాలు!

ప్రపంచ ప్రఖ్యాత టెలివిజన్ సిరీస్ ది సోప్రానోస్ (The Sopranos)లో ‘సాల్వటోర్ "బిగ్ పుస్సీ" బోన్‌పెన్సిరో’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్సెంట్ పాస్టోర్ (80) కన్నుమూశారు. న్యూయార్క్‌లోని సిటీ ఐలాండ్‌లో ఉన్న తన నివాసంలో ఆయన మృతిచెందినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

కొన్ని రోజులుగా విన్సెంట్ పాస్టోర్‌తో ఎలాంటి సంప్రదింపులు జరగకపోవడంతో.. ఇంటి పొరుగువారు వెళ్లి చూడగా, అక్కడ ఆయన విగతజీవిగా కనిపించినట్లు సమాచారం. ఈ ఘటన పలు అనుమానాలకు తావివ్వడంతో, ఆయన మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సాయం చేయడంలో వెనుకాడని వ్యక్తి:

విన్సెంట్ పాస్టోర్‌కు కుమార్తె రెనీ పాస్టోర్ ఉన్నారు. ‘ది సోప్రానోస్’ సిరీస్ సమయంలో ఆయన మేనేజర్‌గా పనిచేసిన బాబ్ మెక్‌గోవన్ ఈ విషాద వార్తను ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ, ‘‘విన్సెంట్ ఎంతో నమ్మకమైన వ్యక్తి. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి వెనుకాడని అరుదైన వ్యక్తి’’ అని భావోద్వేగంగా నివాళులర్పించారు.

ఎన్నో చిత్రాలతో అలరించిన తమ అభిమాన నటుడి మృతిపట్ల హాలీవుడ్ చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. విన్సెంట్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విన్సెంట్ పాస్టోర్ సినీ ప్రస్థానం

నటనపై ఉన్న ఆసక్తితో 40 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన విన్సెంట్ పాస్టోర్, గ్యాంగ్‌స్టర్, రఫ్ అండ్ టఫ్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ తెరకెక్కించిన ‘గుడ్‌ఫెల్లాస్’ (Goodfellas) చిత్రంతో పాటు ‘కార్లిటోస్ వే’ (Carlito's Way), ‘షార్క్ టేల్’ (Shark Tale) వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే, ‘ది సోప్రానోస్’ సిరీస్‌లో ఆయన పోషించిన సాల్వటోర్ "బిగ్ పుస్సీ" బోన్‌పెన్సిరో పాత్ర ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. తన సినీ జీవితంలో 150కిపైగా సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. విన్సెంట్ పాస్టోర్ మృతి పట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు, సహనటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.