- బ్లాక్ డ్రెయిన్ మూసేయడం ఇన్లెట్లు సరిగా లేకపోవడమే కారణం : హైడ్రా చీఫ్ రంగనాథ్
- వరద ముంచెత్తిన ప్రాంతాలను పరిశీలించిన
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో మంగళవారం (జూన్ 09) కురిసిన భారీ వర్షానికి వరద ముంచెత్తిన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ గురువారం పర్యటించారు. మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో పర్యటించి కారణాలను పరిశీలించారు.
కొండాపూర్–మొండికుంట పరిసరాల్లోని మీనాక్షి టవర్స్ వద్ద ఉన్న బాక్స్ డ్రెయిన్‌ను పూర్తిగా స్లాబ్ వేసి మూసేయడం వల్ల పూడిక తీయడానికి వీల్లేకుండా పోయిందని గుర్తించారు. దీనికి తోడు అక్కడ వరద కాలువ కుంచించుకుపోవడం వల్లే నీరు రోడ్లపైకి చేరిందన్నారు.
ఆ కాలువను ఓపెన్ చేసి పూడిక తొలగించాలని, అవసరమైతే కాలువను విస్తరించాలని ఆదేశించారు. బయోడైవర్సిటీ పార్కు– గచ్చిబౌలి మెయిన్‌రోడ్డు నీట మునగడానికి ఖాజాగూడ, మల్కం చెరువులకు వెళ్లే ఇన్‌లెట్లు సరిగా లేకపోవడమే కారణమని తేలింది.
రెండు రోజుల్లోగా ఇన్‌లెట్లను పునరుద్ధరించాలని సూచించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద పూడుకుపోయిన నాలా, మ్యాన్‌హోల్ కారణంగానే వరద నీరు నిలిచిపోయిందని గుర్తించి, సమస్యను పరిష్కరించాలని అధికారులకు చెప్పారు.
మాదాపూర్ (నెక్టర్ గార్డెన్స్) వద్ద ఎస్ఎన్ డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బాక్స్ డ్రెయిన్‌కు, గతంలో ఉన్న లైన్లను లింక్చేయడంలో తలెత్తిన లోపాల వల్లే ఇక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయని పేర్కొన్నారు. ఈ లింక్ప్రక్రియతో పాటు, దుర్గం చెరువు నీటి సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా వరద ముప్పును తప్పించవచ్చని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
మియాపూర్ పరిసరాల్లోని జేపీనగర్ చౌరస్తా, లక్కీ రెస్టారెంట్, ప్రిమార్క్ సుంకృతి అపార్ట్‌మెంట్ పరిసరాల్లో గురునాథ్ చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువలు ఆక్రమణలకు గురికావడం, పూర్తిగా మూసివేయడం వల్లే వరద పోటెత్తిందని తెలిపారు. ఇటీవల కొత్తగా నిర్మించిన రహదారుల వల్ల వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లే మార్గాలు బంద్ అయ్యాయని గుర్తించి, తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు.
