- భూముల మార్కెట్ విలువను భారీగా సవరించిన సర్కార్
- హెచ్‌ఎండీఏ, ఎన్‌హెచ్, ఎస్‌హెచ్ పరిధిలో విస్తృతంగా భూసేకరణ
- ఎకరాకు రూ. 6 లక్షల నుంచి రూ. 21 లక్షల వరకు పెరిగిన విలువ
- పరిహార నిర్ణయంలో నోటిఫికేషన్ విడుదలైన నాటి ధరలే ప్రామాణికం
యాదాద్రి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను సవరించడంతో రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మాత్రం ఈ ధరల పెంపు వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు. యాదాద్రి జిల్లాలో ప్రస్తుతం బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లు, బునాదిగాని కాల్వతో పాటు ప్రతిష్టాత్మకమైన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్), రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓఆర్), ఎంఎంటీఎస్ వంటి పలు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో కొన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం అందగా, మరికొందరికి ఇంకా అందలేదు. ఇంకొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం సర్వే దశలోనే ఉన్నాయి.
భూముల విలువ సవరణ
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021–22 సంవత్సరాల్లో భూముల విలువలను సవరించినప్పటికీ, బహిరంగ మార్కెట్ ధరలకు, రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను సవరించేందుకు చర్యలు చేపట్టింది. వ్యవసాయ, కమర్షియల్ భూముల మార్కెట్ విలువలను 25 శాతం నుంచి వంద శాతానికి పైగా పెంచింది. యాదాద్రి జిల్లాలో సేకరిస్తున్న భూములు ఎక్కువగా హెచ్‌ఎండీఏ, వైటీడీఏ, జాతీయ, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉండటంతో ఇక్కడ ఎకరాకు రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు విలువ పెరిగింది. ట్రిపుల్ ఆర్ పరిధిలో 50 శాతం నుంచి 80 శాతం విలువ పెరిగింది.
నోటిఫికేషనే ప్రామాణికం..
ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ పెంచినా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఏ మాత్రం ఉపయోగ పడడం లేదు. యాదాద్రి జిల్లాలోని ట్రిపుల్ఆర్ఉత్తర భాగం ఐదు మండలాల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రోడ్డుకు మొత్తంగా 1,795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన నోటిఫికేషన్ గతంలోనే రిలీజ్అయ్యాయి.
ట్రిపుల్ఆర్నోటిఫికేషన్ 2022లో రిలీజ్ అయింది. రూల్స్ ప్రకారం భూ సేకరణ నోటిఫికేషన్రిలీజ్అయిన ఏడాది రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో విలువకు మూడు రెట్లు, మున్సిపాలిటీల్లో రెండు రెట్ల పరిహారం అందిస్తుంది. దీనివల్ల మార్కెట్ ధరలు ఇప్పుడు ఎంత పెరిగినా, నిర్వాసితులకు మాత్రం పాత ధరల ప్రకారమే పరిహారం అందనుంది.
