" పుష్ప " సినిమా స్టయిల్ లో టేకు దుంగల రవాణా..

" పుష్ప " సినిమా స్టయిల్ లో టేకు దుంగల రవాణా..

సినిమాల ప్రభావం సాధారణ ప్రజలపై ఎంత మేరకు ఉంటుందో లేదో తెలియదు కానీ..దొంగలపై మాత్రం వందకు వంద శాతం ఉంటుంది.  సినిమాలు చూసి దొంగలు మరింత చాకచక్యంగా ఎలా చోరీ చేయాలో నేర్చుకుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి  తప్పించుకునేందుకు  సినిమాల్లోని ప్లాన్స్ ను అమలు చేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో  తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఓ ట్రక్కులో టేకు దుంగలను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు " పుష్ప"  సినిమాలోని అల్లు అర్జున్ వ్యూహాలను కాపీ కొట్టి అమలు చేశారు. అయితే దొంగల కంటే తెలివిమీరిన అటవీశాఖ అధికారులు...చోరీగాళ్ల ఆట కట్టించారు. అక్రమంగా రవాణా చేస్తున్న టేకు కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

పుష్ప సినిమా స్టైల్లో...

మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని  సిరోంచ దట్టమైన అటవీప్రాంతం నుంచి స్మగ్లర్లు తెలంగాణలోని భూపాలపల్లికి ఇద్దరు స్మగ్లర్లు  టేకు దుంగలను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఈ దుంగలు అటవీశాఖ అధికారులకు కనిపించకుండా ట్రక్కును ప్రత్యేకంగా డిజైన్ చేశారు స్మగ్లర్లు. ట్రక్కు కిందభాగంలో దుంగలను దాచి పై భాగాన్ని వెల్డింగ్ చేశారు. అనంతరం భూపాలపల్లిలోని తెలంగాణ బార్డర్ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అటవీ శాఖ చెక్ పోస్టు దగ్గర అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో టేకు దుంగల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ. 60 వేల విలువైన టేకు దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు  స్మగ్లర్లను అరెస్ట్ చేసి..ట్రక్కును సీజ్ చేశారు. 

టేకు దుంగలకు డిమాండ్..

తెలంగాణలో ఈ టేకు దుంగలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మహారాష్ట్ర సిరోంచ  అటవీప్రాంతం నుంచి దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు ..వాటిని వరంగల్ జిల్లాలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు అడుగుల పొడవు, ఆరు అంగుళాల వెడల్పు ఉన్న ఒక్క టేకు దుంగను రూ.5,000 నుంచి 6,000 మధ్య విక్రయిస్తున్నారు. అయితే  అదే దుంగను మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రూ.2,500 నుంచి రూ.3,200 వరకు మాత్రమే అమ్ముడవుతుంది. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు తెలంగాణకు టేకు దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారని అటవీ శాఖ అధికారులు తెలిపారు.