వరద సాయం ఏది?

వరద సాయం ఏది?
  • మంచిర్యాల జిల్లాలో 5 వేల ఇండ్లు మునక 
  • 50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 
  • పంటనష్టంపై ప్రపోజల్స్​ కూడా కోరని ప్రభుత్వం  
  • సీఎంను ఎమ్మెల్యేలు కలిసినా ఫలితం శూన్యం 

మంచిర్యాల,వెలుగు : మంచిర్యాల జిల్లాను వరదలు ముంచెత్తి నెల రోజులు గడిచినా.. ముంపు బాధితులకు సర్కారు నుంచి ఇప్పటివరకు నయా పైసా సాయం అందలేదు. జిల్లావ్యాప్తంగా 5 వేలకు పైగా ఇండ్లు, 50 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.   ప్రభుత్వం పంటనష్టంపై వ్యవసాయ శాఖ ద్వారా కనీసం ప్రపోజల్స్​ కూడా కోరలేదు.   

జిల్లా అతలాకుతలం...  
జులై 13 నుంచి 16 వరకు గోదావరి నదికి వరద పోటెత్తింది. కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో మంచిర్యాల జిల్లా అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలోని 13 కాలనీలు నీటమునిగాయి. జన్నారం నుంచి కోటపల్లి వరకు గోదావరి తీర ప్రాంతంలోని 40 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 5వేలకు పైగా ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 5వేల ఇండ్లు నీటమునిగాయి. ప్రజలు వారం రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్​ నగర్​, రాంనగర్​, ఎల్​ఐసీ కాలనీ, పద్మశాలివాడ, ఆదిత్య ఎన్​క్లేవ్, సాయికుంట, నస్పూర్​లోని వినూత్నకాలనీ, వేంపల్లిలోని ఇండ్లు ఫస్ట్​ ఫ్లోర్​ వరకు మునిగిపోయాయి. విలువైన ఫర్నీచర్​, ఎలక్ర్టానిక్​ పరికరాలు చెడిపోయాయి. దుకాణాల్లోని సామాన్లన్నీ ఖరాబ్​ అయ్యాయి. ఇండ్ల గోడలు, పీవోపీ సీలింగ్, కప్​బోర్డులు, ఎలక్ర్టికల్​ వ్యవస్థ దెబ్బతిన్నాయి. ఒక్కో ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం జరిగింది. జల విలయం నుంచి ప్రజలు నేటికీ కోలుకోలేదు. వరద విధ్వంసం కళ్లముందే కనిపిస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. వరద బాధితులకు ప్రభుత్వం నుంచి పైసా నష్టపరిహారం అందలేదు. సీఎం కేసీఆర్​ భద్రాద్రి, ములుగు జిల్లాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు రూ.10వేల తక్షణసాయం అందిస్తామన్నారు. భద్రాచలంలో శాశ్వత ముంపు నివారణ చర్యల కోసం రూ.వెయ్యి కోట్లు ప్రకటించారు. అదే స్థాయిలో వరదలతో అతలాకుతలమైన మంచిర్యాల జిల్లాకు సీఎం రాలేదు. బీజేపీ, కాంగ్రెస్​ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవాలని దీక్షలు, ధర్నాలు చేసినా స్పందించలేదు. రూ.10వేల తక్షణసాయం అందించకపోవడంతో సర్కారు తీరుపై వరద బాధితులు మండిపడుతున్నారు.  

రైతుల గోడు పట్టదా?  
కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్​ వాటర్​తో జిల్లాలోని గోదావరి తీర గ్రామాల్లో 35 వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. పత్తి పెట్టిన నెల రోజులకే వరదలు రావడంతో  రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వరద తగ్గడంతో రైతులు మళ్లా పత్తి విత్తులు వేశారు. తిరిగి 15 రోజులకే ప్రాణహిత నది మరోసారి ఉప్పొంగింది. కాళేశ్వరం బ్యాక్​ వాటర్​ వల్ల వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని 20 గ్రామాల్లో 10 వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వ్యవసాయ  అధికారులు గోదావరి వరదలతో జరిగిన పంటనష్టాన్ని సర్వే చేసి కలెక్టర్​కు రిపోర్టు ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇంతవరకూ పంటనష్టంపై ప్రపోజల్స్​ కూడా కోరలేదని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని నాలుగేండ్లుగా రైతులు ఆగమవుతున్నారు. 2019 నుంచి వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. కోటపల్లి, చెన్నూర్​ మండలాల్లో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ అధికారులు ఏటా సర్వేలు చేసి రిపోర్టులు పంపడమే తప్ప ప్రభుత్వం పైసా పరిహారం ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ముంపు బాధితుల ఆందోళనలతో ఎమ్మెల్యేలు రేఖానాయక్​, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్​రావు ఇటీవల ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను కలిసి వరద బాధితులను ఆదుకోవాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విన్నవించినా స్పందన శూన్యం. 

ఈ సీజన్​లోనే రెండుసార్లు పంటలు మునిగినయ్​  
మా తాతలు తండ్రుల కాలం నుంచి ఎన్నడూ గిన్నిసార్లు పంటలు మునగలే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరిలో నీళ్లు ఆపడం వల్ల పోటు కమ్ముతోంది. ఏటా రెండుసార్లు పంటలు నీటమునుగుతున్నాయి. ఈ సీజన్​లోనే రెండుసార్లు వరదలు వచ్చి ఎకరానికి రూ.50వేల నష్టం జరిగింది. నాలుగేండ్లుగా పంటలు దెబ్బతింటున్నా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తలేదు. 
- జంగం రాజేశ్​, అన్నారం, కోటపల్లి మండలం 

కౌలు పడ్తలేరు.. అమ్ముదామన్నా కొంటలేరు 
కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యామాని నాలుగేండ్ల నుంచి పంటలు మునుగుతున్నయి. అధికారులు సర్వే చేసి రైతుల పేర్లు రాసుకొని పోతున్నరు కానీ పరిహారం మాత్రం వస్తలేదు. వరదల వల్ల మా భూములను ఎవరూ కౌలుకు పడ్తలేరు. అమ్ముదామన్నా కొంటలేరు. ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలె. లేదంటే మా భూములకు ఎకరానికి రూ.20 లక్షలు ఇచ్చి ప్రభుత్వమే కొనాలె.   - పడాల మహేశ్​, కోటపల్లి మండలం, రాంపూర్​

సర్వే చేసి పరిహారం అందించాలి 
కాళేశ్వరం బ్యాక్​ వాటర్​ వల్ల గోదావరి, ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో అపారనష్టం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చాలా గ్రామాలు నీటమునిగాయి. వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.10వేల చొప్పున అందించాలి. జిల్లాకు రూ.5కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి. సమగ్ర సర్వే చేసి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి.  
- వెరబెల్లి రఘునాథ్​రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

కలెక్టర్​కు రిపోర్టు ఇచ్చాం  
జిల్లాలో గోదావరి వరదలతో జరిగిన పంటనష్టంపై సర్వే చేసి కలెక్టర్​కు రిపోర్టు ఇచ్చాం. ఇటీవల ప్రాణహిత వరదలతో జరిగిన నష్టంపై కూడా సర్వే చేస్తున్నాం. మా సర్వేలో 27వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు గుర్తించాం. పంటనష్టంపై ప్రపోజల్స్​ పంపాలని ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. 
- కల్పన, జిల్లా వ్యవసాయ అధికారి, మంచిర్యాల