ఫామ్​హౌస్​ కేసులో కరీంనగర్​ అడ్వకేట్​ శ్రీనివాస్​ కూడా ..!

ఫామ్​హౌస్​ కేసులో కరీంనగర్​ అడ్వకేట్​ శ్రీనివాస్​ కూడా ..!
  • 21న విచారణ కోసం హైదరాబాద్ రావాలని సిట్​ ఆదేశం

  •  తుషార్‌‌‌‌కు కూడా  నోటీసులు

హైదరాబాద్‌‌, వెలుగు: మొయినాబాద్​ ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌‌‌ (సిట్‌‌‌‌) కేరళకు చెందిన తుషార్​కు నోటీసులు ఇచ్చింది. రామచంద్రభారతి స్టేట్‌‌మెంట్‌‌, ఆడియో రికార్డ్ ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్‌‌ బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సిట్ ఆఫీస్‌‌లో హాజరుకావాలని ఆదేశించింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి, రామచంద్రభారతికి మధ్య జరిగిన ఫోన్‌‌ సంభాషణల్లో తుషార్ పేరు ఉండటంతో విచారించేందుకు సీవీ ఆనంద్‌‌ నేతృత్వంలో  సిట్​ఏర్పాట్లు చేస్తున్నది.

నల్గొండ ఎస్పీ రెమారాజేశ్వరి ఆధ్వర్యంలోని టీమ్‌‌ గత వారం రోజులుగా కేరళలో సోదాలు నిర్వహిస్తున్నది. తుషార్‌‌‌‌కు సన్నిహితుడైన ఓ ప్రైవేట్‌‌ హాస్పిటళ్ల జాయింట్ డైరెక్టర్‌‌‌‌ జగ్గూతో పాటు మరో ఇద్దరిని విచారించింది. ఈ సోదాల్లో సేకరించిన సమాచారంతో పాటు ఆడియో రికార్డింగ్‌‌ ఆధారంగా తుషార్‌‌‌‌కు నోటీసులు పంపింది. అదేవిధంగా కరీంనగర్​కు చెందిన  అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్​కు కూడా నోటీసులు జారీ చేసింది. ఇంట్లో ఆయన లేకపోవడంతో ఇంటి తలుపులకు అధికారులు నోటీసులు అంటించివెళ్లారు. 

సింహయాజికి ఫ్లైట్‌‌ టికెట్స్‌‌ బుక్‌‌ చేశారనే ఆరోపణలతో  శ్రీనివాస్‌‌కు 41(ఏ) సీఆర్‌‌‌‌పీసీ కింద ఈ నోటీసులను సిట్​ ఇష్యూ చేసింది. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు బంజారాహిల్స్‌‌లోని కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌లో సిట్‌‌ ముందు హాజరుకావాలని, విచారణకు రాకుంటే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.

త్వరలో ఓ జాతీయ పార్టీ నేతకూ నోటీసులు!

రామచంద్రభారతి ఆడియో రికార్డుల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ జాతీయ పార్టీ నేతకు నోటీసులు ఇచ్చేందుకు సిట్​ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ కేసుతో సదరు నేతకు సంబంధం ఉన్నా లేక పోయినా వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే లీగల్‌‌ అడ్వయిజర్లతో సిట్‌‌ భేటీ అయింది. ఎలాంటి సెక్షన్ల కింద నోటీసులు జారీ చేయాలనే అంశంపై చర్చించింది. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రంలోని కొందరు నేతలతో పాటు ఢిల్లీకి చెందిన మరికొందరు నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.