తెలివిమీరిన దొంగలు..సీసీ కెమెరాలకు మస్కా

తెలివిమీరిన దొంగలు..సీసీ కెమెరాలకు మస్కా
  • గుర్తు పట్టకుండా మాస్కులు
  • ఫింగర్​ ప్రింట్స్​ దొరక్కుండా గ్లౌజులు
  • ఫోన్లు వాడి పడేసి పోతున్నారు
  • టైమర్స్​ సెట్​ చేసుకొని చోరీలు

సిటీలో దొంగలు తెలివిమీరిపోతున్నారు. నేరాల దర్యాప్తు, కేసుల ఛేదనలో పోలీసులకు దొరకకుండా ఎప్పటి కప్పుడు అప్ డేట్ అవుతున్నారు. నేరాలకు చెక్‌ పెట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ముఖం కనిపించకుండా మాస్కులు వేసుకుని తప్పించుకుంటున్నారు. క్లూస్‌ టీం వస్తే ఫింగర్‌ ‌ప్రింట్స్‌‌ దొరుకుతాయని గ్లౌజులు ధరించి మస్కా కొడుతున్నారు. స్మార్ట్‌‌ ఫోన్లు కాకుండా బేసిక్‌ ఫోన్లు, ఫేక్‌ సిమ్‌ లు వాడుతూ పనయ్యాక పడేసి పోతున్నారు. పోలీసులు ఎంత లేటెస్ట్ ఎక్విప్ మెంట్ వాడినా ఇట్లాంటి కేసుల్లో నేరస్థుల జాడ కనిపెట్టడం కష్టం గా మారుతోంది. 259 చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మంత్రి శంకర్, 48 వరుస చోరీలు చేసిన కర్రి సత్తిని ఈ మధ్యే అరెస్టు చేశారు. ఎప్పుడూ ఫోన్‌‌ వాడని శంకర్‌‌ ఒక చోరీలో ఫోన్‌‌ మాట్లాడి దొరికిపోయాడు. కర్రి సత్తి ఆ పని కూడా చేయలేదు. కానీ పోలీసులకు సమాచారం రాగా వల పన్ని పట్టుకున్నారు. లేకపోతే  అతడు కూడా దొరక్కపోయెటోడు

ఆధునిక టెక్నాలజీతో కేసులను ఛేదిస్తున్న

పోలీసులకు దొంగలు కొత్త చిక్కులు తెస్తున్నారు. సీసీ కెమెరాలకు చిక్కినా చేతికి దొరక్కుండా తప్పించుకుంటున్నారు. ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లౌజ్, ముఖ కవళికలు కనిపించకుండా మాస్క్ లు ధరిస్తున్నారు. కెమెరా కన్ను చూస్తున్నా డోంట్ కేర్ అంటూ డోర్స్ బ్రేక్ చేస్తున్నారు. ఈ ఏడాది చిక్కిన దొంగల ముఠాల తీరు పరిశీలిస్తే ఇదే తెలుస్తోంది. జైళ్లలో పరిచయమైన వారి నుంచి కొత్త అంశాలు నేర్చుకుని తాము అలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్, ఫింగ్ ప్రింట్స్ డేటాతో ఈమధ్య పాతనేరస్థులు కొంతమంది చిక్కారు. చోరీ సమయంలో సెల్ ఫోన్లు ఉపయోగించడంతో వారిని ట్రేస్ చేయడం పోలీసులకు ఈజీ అయింది. ఇది తెలుసుకున్న దొంగలు డిజిటల్ పరికరాలు వాడకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ముగ్గురు కంటే ఎక్కువ మంది చోరీలో పాల్గొంటే మొబైల్ ఫోన్ కాకుండా కౌంట్ డౌన్ టైమర్లను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

కొట్టేసిన ఫోన్లు​, సిమ్ కార్డులతో

మొబైల్ ఫోన్ వాడకం తప్పనిసరైతే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సిమ్‌‌ కార్డులను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసం స్మార్ట్ ఫోన్ కాకుండా బేసిక్ ఫోన్లను వాడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగదీశ్​ మార్కెట్, సికింద్రాబాద్, హాంకాంగ్ మార్కెట్ లాంటి సెకండ్ సేల్స్ మార్కెట్లలో కొట్టేసిన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. చోరీ తర్వాత సిమ్ కార్డ్ ఓ చోట, మొబైల్ ఫోన్ డ్రైనేజీలో,  చెట్లపొదల్లో పారేసి ఎస్కేప్ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీన్ ఆఫ్ అఫెన్స్ లో మొబైల్ సిగ్నల్ చిక్కినా దొంగలు ట్రేస్ కావడానికి అవకాశాలు తక్కువ ఉంటున్నాయి. సీసీ కెమెరాల నుంచి కూడా తప్పించుకునేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. టార్గెట్ చేసిన ఏరియాల్లో  రెక్కీ నిర్వహించి, సీసీ కెమెరాలకు ముఖం కనిపించకుండా కర్చీప్,హెల్మెట్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. బైక్స్ కు నకిలీ నంబర్ ప్లేట్ తగిలించుకుని షికారు చేసి, రాత్రి సమయాల్లో టార్గెట్ చేసిన ఇంటికి సమీపంలో బైక్, ఆటో పార్క్ చేసి మాస్క్, టోపీలతో చోరీలు చేస్తున్నట్టు పలు కేసులను పరిశీలిస్తే అవగతమవుతోంది. ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా దొరక్కుండా చేతులకు గ్లౌజ్‌‌లు, కాళ్లకి షూ వేసుకుంటున్నారు. పోలీసులు ఎంత లేటెస్ట్​ టెక్నాలజీ ఉపయోగించినా కొన్ని కేసుల్లో నేరస్థులను పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు పేర్కొంటున్నారు.

సెల్ సిగ్నల్ తో చిక్కిన మంత్రి శంకర్​

సీసీ కెమెరాల కళ్లుగప్పి తప్పించుకు తిరిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్​ మంత్రి శంకర్‌‌ సెల్​ఫోన్​ సిగ్నల్​తో పోలీసులకు దొరికాడు. పగటి పూట నెత్తిన టోపీ పెట్టుకుని రెక్కీ వేసి, రాత్రి వేళ ముఖానికి మాస్క్​తో చోరీలు చేసేవాడు. 40 ఏళ్లుగా ఒంటరిగా 259 చోరీలు  చేసినా దొరలేదు. చిన్న రాడ్డు, స్క్రూ డ్రైవర్లతో టార్గెట్ చేసిన ఇంటిని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో కొల్లగొట్టేవాడని పోలీసులు తెలిపారు. బోయిన్‌‌పల్లి, బేగంపేట, మారేడ్‌‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. ఇవన్నీ పాతబస్తీకి చెందిన ఒబేద్, జాఫర్‌‌ఖాన్‌‌లతో పాటు బన్సీలాల్‌‌పేటకు చెందిన దినకర్‌‌ తో కలిసి చేశాడు.

11 కేసుల్లో అరెస్టై  జైలుకెళ్లి 18నెలల తర్వాత పోయిన నెల 19న విడుదలయ్యాడు. మళ్లీ కార్ఖానా, తుకారాంగేట్​, నేరేడ్​మేట్​, కుషాయి గూడ స్టేషన్ల పరిధిలో ఐదు చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిందితుడి సెల్ ఫోన్ నంబర్ సిగ్నల్​ ఆధారంగా పోలీసులు వలవేసి పట్టుకున్నారు.

ముఖానికి మాస్క్​తో ఐదేళ్లుగా చోరీలు

చాంద్రాయణగుట్ట పోలీసులు గత వారం అరెస్టు చేసిన మహ్మద్ సమీర్(36) కూడా సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్క్ ధరించి చోరీలు చేసేవాడని పోలీసులు చెప్పారు. ఎవరూ అనుమానించకుండా డే టైమ్ లో రెక్కీ వేసి తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్​​ చేసేవాడని, సెలెక్ట్ చేసుకున్న ఇండ్లలో రాత్రి చోరీకి పాల్పడేవాడని తెలిపారు. సుత్తి, స్ర్కూ డ్రైవర్‌‌ తో తాళాలు పగులగొట్టి ఇండ్లను లూటీ చేసేవాడు. ఇలా ఐదేళ్లలో చేసిన 9 చోరీల్లో మొత్తం రూ.25 లక్షలకు పైగా బంగారం, వెండీ దొంగిలించాడు. ఎప్పటి లాగే రెక్కీ నిర్వహిస్తున్న సమీర్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 520 గ్రాముల బంగారు ఆభరణాలు,1040 గ్రాముల వెండి, 2000 రియాల్స్‌‌, స్ర్కూ డ్రైవర్‌‌, సుత్తి స్వాధీనం చేసుకున్నారు.

వరుస చోరీల కర్రి సత్తి.. దొరికాడు

గతేడాది నవంబర్ 27న పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ దొంగ కర్రి సత్తి(34) పోలీసులకు సవాల్ విసిరాడు. మన రాష్ట్రంతో పాటు ఏపీ, తమిళనాడు, బెంగళూర్ లో 48 వరుస చోరీలు చేశాడు. చోరీ చేస్తున్న సమయంలో ముఖానికి మాస్క్ వేసుకుని సీసీ కెమెరాలను ధ్వంసం చేసేవాడు. రెక్కీ వేసే సమయంలో క్యాప్ పెట్టుకుని సీసీ కెమెరాల్లో ముఖం క్యాప్చర్ కాకుండా జాగ్రత్త పడేవాడు. మరో ఇద్దరిని కాపలాగా పెట్టి గ్లౌజ్,మాస్క్ వేసుకుని లూఠీ చేశాడు. దొంగిలించిన సొత్తు ముంబైలో అమ్మేందుకు వెళ్తున్న టైంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశారు.