న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండీ కూటమి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఇండీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ 2024 తర్వాతే అమల్లోకి వచ్చింది. కానీ అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమి పాలైంది. దీనికి కూడా సర్ ప్రక్రియే కారణం అంటారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోతోందని ఎద్దేవా చేశారు.
గత 33 ఏళ్లుగా త్రిపురలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గెలవలేదు. బెంగాల్‌లో 54 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. బెంగాల్, త్రిపుర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు, ఐదు దశాబ్దాలుగా ఓటమిని చవిచూస్తూనే ఉంది. దీనికి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియే కారణమా అని నిలదీశారు. 2024 నుంచి సర్ అమలు చేశారు.. అప్పుడే రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నేత అయ్యారు. రాహుల్ ప్రతిపక్ష నేత అయ్యాక ఆయన నేతృత్వంలో బెంగాల్, తమిళనాడు, అస్సాం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు.
అలాగే, ఇటీవల తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా విజయం సాధించలేదని విమర్శించారు. ఈ విజయాలు ప్రధాని మోడీ ప్రజాదరణకు నిదర్శనమని, దీనిని సర్ ప్రక్రియకు ముడిపెట్టడం హాస్యాస్పదమని చురకలంటించారు. ఇకనైనా సర్ ప్రక్రియను వేలెత్తి చూపడం మాని, కాంగ్రెస్ పార్టీ తమ వరుస ఓటములపై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
►ALSO READ | ఉచ్చు బిగుస్తుంది.. చూస్కోండి.. మోదీ, అమిత్ షా, జ్ఞానేష్కు రాహుల్ వార్నింగ్
సర్ ప్రక్రియను వ్యతిరేకించడం వెనుక కాంగ్రెస్‌కు ఒక అజెండా ఉందన్నారు. చొరబాటుదారులను కాపాడటానికే రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పన్నాగాలను దేశ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని, వారి మాటలను ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. ఈ దేశ ప్రజలు ప్రధాని మోడీ, ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారని పేర్కొన్నారు.
2029 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగోసారి ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో ఓటమి కోసం రాహుల్ గాంధీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశ ప్రజలు ఎవరి వైపు ఉన్నారో 2029లో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
