వ్యాపారులకు బిగ్ రిలీఫ్: UPI పేమెంట్స్‌పై ఛార్జీలు దీపావళి వరకూ వాయిదా

వ్యాపారులకు బిగ్ రిలీఫ్: UPI పేమెంట్స్‌పై ఛార్జీలు దీపావళి వరకూ వాయిదా

UPI ఛార్జీల విషయంపై ఆందోళన చెందుతున్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట అందించింది. దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసే వరకు యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అమలును వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన విధంగా అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ కొత్త యూపీఐ ఛార్జీల విధానం.. ఇప్పుడు దీపావళి ముగిసిన వెంటనే ప్రకటించబడే కొత్త తేదీ నుంచి అమలవుతుంది.

వ్యాపార సంఘాలు, ట్రేడ్ బాడీల విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పండుగల సమయంలో డిజిటల్ లావాదేవీలపై అదనపు భారం పడితే వ్యాపారాలు దెబ్బతింటాయని.. సేల్స్ మందగిస్తుందని వ్యాపారులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఇబ్బందులు, పండుగ సీజన్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ ఛార్జీల వాయిదా నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నదిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

రూ.2వేల కంటే ఎక్కువ విలువైన బిజినెస్ పేమెంట్స్ అంటే P2M ట్రాన్సాక్షన్లపై యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR విధించాలని సెప్టెంబర్ 15న ఎన్పీసీఐ ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుత వాయిదా కారణంగా సుమారు 96 శాతం మంది చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రస్తుతానికి వెసులుబాటు దక్కింది. ఇది చెల్లింపుల వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా.. పండుగ జోరును కాపాడుతుంది.

ఈ నిర్ణయం ద్వారా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు తగినంత సమయం లభించింది. పండుగ ఉత్సాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా లావాదేవీలు యథావిధిగా ఫ్రీగానే కొనసాగనున్నాయి. దీపావళి హడావుడి ముగిసిన తర్వాత ఛార్జీల కొత్త అమలు తేదీని ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నోటిఫై చేయనున్నాయి. డిజిటల్ పేమెంట్స్ స్వీకరించే వ్యాపారులకు ఇది పెద్ద ఉపశమనం అనే చెప్పుకోవాలి.