ఇడ్లీ ఏటీఎం.. 55 సెకన్లలోనే వేడివేడిగా

ఇడ్లీ ఏటీఎం.. 55 సెకన్లలోనే  వేడివేడిగా

ఇప్పటివరకు మనం మనీ, వాటర్ ఏటీఎం మాత్రమే చూశాం.. కానీ బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సరికొత్తగా అలోచించి ఇడ్లీ ఏటీఎంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏటీఎం వద్దకు వచ్చి ఆర్డర్ చేస్తే చాలు.. ఇడ్లీతో పాటుగా చట్నీని 55 సెకన్లలోనే ప్యాక్ చేసి ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

12 నిమిషాల్లో 72 ఇడ్లీలు సప్లయ్‌

బెంగళూరుకు చెందిన శరణ్‌ హిరేమత్‌, సురేష్‌ చంద్రశేఖరన్‌ ఇడ్లీ ఏటీఎంను ఏర్పాటు చేశారు. వీరు స్థాపించిన ‘ఫెషాట్‌ రోబోటిక్స్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ దీన్ని  రూపొందించింది. 24*7 ఇడ్లీలను సప్లయ్‌ చేయగలిగే ఈ మిషన్..  కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలను సప్లయ్‌ చేయగలదు. వీటిని అక్కడే తినొచ్చు.. లేదంటే ఇంటికి పార్సిల్‌ తీసుకెళ్లొచ్చు. ఏటీఎం నుంచి ఇడ్లీలను ఎలా పొందాలంటే ... ముందుగా ఏటీఎం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే  మెనూ వస్తుంది. అందులో ఆర్డర్‌ చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తే క్షణాల్లో వేడివేడి ఇడ్లీలు మన చేతిలో ఉంటాయి. 

చేదు అనుభవమే ఆలోచనకు నాంది

శరణ్‌ హిరేమత్‌ కు ఎదురైన చేదు అనుభవమే ఈ ఆలోచనకు నాంది పలికింది. 2016లో ఆయన కూతురు అనారోగ్యంతో బాధపడటం, అర్థరాత్రి ఎక్కడా ఇడ్లీలు వేడిగా దొరకకపోవటంతో  ఈ ఆలోచన వచ్చిందట.. అటువంటి ఆహారాన్ని ఎల్లవేళలా అందుబాటులోకి తీసుకురావడానికి ఏకైక మార్గం ఆటోమెటిక్ యంత్రాన్ని తయారు చేయడమేనని హిరేమత్‌ భావించారట. ప్రస్తుతం ఈ ఏటీఎం బెంగళూరులోని రెండు చోట్లలో ఏర్పాటు చేశారు. మరిన్ని ప్రాంతాలలో దీనిని విస్తరించాలనే యోచనలో ఉన్నారు. భవిష్యత్తులో దోసె బోట్స్‌, రైస్‌బోట్స్‌, జ్యూస్‌బోట్స్‌ వంటి ఏటీఎంలను కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.