దాయాది దేశం పాకిస్థాన్‌కు దీపావళి పండుగ వేళ ప్రధాని మోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించారు. కచ్ఛ్ తీరంలోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బందితో కలిసి మోడీ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్మీ దుస్తులు ధరించి దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోడీ జవాన్లకు స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ఇండియన్ నేవీ బోట్లో క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్దకు మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దులో ఉన్న కచ్ తీరం వైపు పాక్ కన్నైత్తి చూసే సాహసం చేయదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే.. కచ్ తీరంలో సుశిక్షితులైన సైనికులు గస్తీలో ఉన్నారని పాక్‌కు తెలుసని అన్నారు.
ALSO READ | ఇంచు భూమి కూడా వదులుకోం.. బార్డర్లో రాజీ పడే ప్రసక్తే లేదు: ప్రధాని మోడీ
వ్యుహాత్మకమైన సర్ క్రీక్ ప్రాంతంపై దాడికి గతంలో శత్రుదేశాలు కుట్రలు చేశాయని.. ఇక్కడ ఉన్న సైనికులు ఆ కుట్రలను తిప్పికొట్టారని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. 1971 ఇండో పాక్ యుద్ధంలోనూ సర్ క్రీక్ ప్రాంతంలో ఇండియన్ నేవీది కీలక పాత్ర అని కొనియాడారు. ఇక, కచ్ తీరంలో జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.