కవయిత్రి మరియం
టైటిల్ : బ్యాండ్వాలే
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : అక్షత్ వర్మ, అంకుర్ తివారి
కాస్ట్ : షాలినీపాండే, జహాన్ కపూర్, స్వానంద్ కిర్కిరే, ఆశిష్ విద్యార్థి, అనుపమ కుమార్, సంజన దీపు
మలయాళీ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మరియం (షాలినీపాండే). తండ్రి డేవిడ్ (ఆశిష్ విద్యార్థి) కాలేజీ ప్రిన్సిపాల్. పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. గ్రాడ్యుయేషన్ పూర్తైన వెంటనే కూతురికి పెండ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ.. మరియం మాత్రం గొప్ప కవయిత్రిగా ఎదగాలని కలలు కంటుంటుంది. వాళ్ల నాన్నకు తెలియకుండా సోషల్ మీడియాలో తన కలం పేరుతో కవితలను షేర్ చేస్తుంటుంది. స్వేచ్ఛ కోసం, తన కలను సాకారం చేసుకునేందుకు పోరాడుతుంది. మరియం చెల్లెలు సింథియా (సంజన దీపు) కూడా ఆమెకు సాయం చేస్తుంటుంది. అయితే.. కవితలకు రీచ్ రాకపోవడంతో వాటికి మ్యూజిక్ యాడ్ చేయాలని స్టార్ బ్రాస్ బ్యాండ్ సింగర్ రోబో (స్వానంద్ కిర్కిరే) సాయం తీసుకుంటుంది. అయినా పెద్దగా రీచ్ పెరగకపోవడంతో డీజే సైకో (జహాన్ కపూర్) సాయం కోరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరియం కవయిత్రిగా పేరు తెచ్చుకుందా? లేదా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాలి.
ఎత్తుకెళ్లింది ఎవరు?
టైటిల్ : బేబీ గర్ల్, ప్లాట్ ఫాం : సోనీలివ్
డైరెక్షన్ : అరుణ్ వర్మ
కాస్ట్ : నివిన్ పౌలీ, లిజోమోల్ జోస్, సంగీత్ ప్రతాప్, అభిమన్యు తిలకన్, అజీస్ నెడుమంగడ్, అశ్వత్ లాల్, అదితి రవి, నిషా సారంగ్, జాఫర్ ఇడుక్కి
తిరువనంతపురంలోని గుడ్ షెపర్డ్ హాస్పిటల్‌లో సనల్ మాథ్యూ (నివిన్ పాలీ) అటెండర్‌గా పనిచేస్తుంటాడు. క్రిస్మస్ ఈవ్ రోజు ఆ హాస్పిటల్ నుంచి మూడు రోజుల పసికందుని బుర్ఖా వేసుకున్న ఒక మహిళ ఎత్తుకెళ్తుంది. ఆ రోజు ఆలస్యంగా డ్యూటీకి వచ్చిన సనల్ సస్పెక్ట్‌ను చూశానని పోలీసులతో చెప్తాడు. వాళ్లు వెంటనే దర్యాప్తు మొదలుపెడతారు. కానీ.. ఆ రోజు ముఖ్యమంత్రి కార్యక్రమానికి బందోబస్తు కోసం చాలామంది పోలీసులు వెళ్లడంతో పూర్తిస్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టలేకపోతారు. అయితే.. ఈ కేసులో సనల్‌ను విచారించిన తర్వాత అతన్ని కూడా అనుమానిస్తారు. ఇంతకీ ఆ బేబీ ఎవరి బిడ్డ? ఎత్తుకెళ్లింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాలి.
నాయకుడు
టైటిల్: తలైవర్ తంబి తలైమయిల్
ప్లాట్ ఫాం: నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్: నితీష్ సహదేవ్
కాస్ట్: జీవా, తంబి రామయ్య, ఇళవరసు, ప్రార్థన నాథన్, సాయి విఘ్నేష్, జెన్సన్ దివాకర్, జైవంత్, సుబాష్ కన్నన్, సర్జిన్ కుమార్
జీవరత్నం(జీవా) ఒక పల్లెటూరికి ప్రెసిడెంట్. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ప్రజలకు దగ్గరై ఓట్లు సంపాదించుకోవాలి అనుకుంటాడు. అందుకే ఊళ్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అన్నీ తానే ముందుంటాడు. అదే ఊరికి చెందిన ఇళవరసు(ఇళవరసు) కూతురు సౌజన్య(ప్రార్థన నాథన్) పెళ్లి బాధ్యత కూడా తీసుకుంటాడు. తెల్లవారితే పెండ్లి.. పొరిగింట్లో ఉండే మణి (తంబి రామయ్య) తండ్రి చనిపోతాడు. ఓవైపు పెళ్లిసందడి, మరోవైపు విషాదం. ఇళవరసు, మణిల మధ్య పాత శత్రుత్వం ఉంది. దాంతో పెళ్లి జరిగే టైంలోనే మణి తన తండ్రి అంత్యక్రియల ఊరేగింపు చేస్తానని పట్టుపడతాడు. ఇళవరసు కూడా తన ఇంటి ముందే అదే టైంలో పెళ్లి జరగాలని భీష్మించుకుంటాడు. జీవరత్నం ఇద్దర్నీ శాంతపరిచే ప్రయత్నం చేస్తుంటాడు. చివరికి ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి.
