- ఇండియన్ లాంగ్వేజ్‌ల కోసం ప్రత్యేకంగా మోడల్స్ అభివృద్ధి
- భారత భాషల్లో చాట్ జీపీటీ, గూగుల్ జెమిని కంటే మెరుగ్గా సర్వం ఏఐ పెర్ఫార్మెన్స్
- ఆఫ్‌లైన్‌లోనూ పనిచేసే భారత్ జీపీటీ మిని అందుబాటులోకి..
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శకం మొదలైంది. ఈ టెక్నాలజీ సీరియస్‌గా తీసుకోని వాళ్లు అభివృద్ధిలో వెనకబడిపోతారనడంలో అతిశయోక్తి లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ వంటి బిగ్ టెక్ కంపెనీలతో అమెరికా తన డామినెన్స్‌ను కొనసాగిస్తుండగా, డీప్‌సీక్, అలిబాబా, మూన్‌షాట్ ఏఐ వంటి చైనీస్ కంపెనీలు సైతం గ్లోబల్ ఏఐ సెక్టార్‌లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూడా తనదైన శైలిలో సైలెంట్‌గా ఏఐ సామర్ధ్యాన్ని బలపరుచుకుంటోంది. ముఖ్యంగా ఇండియా ఆధారిత ఏఐ మోడళ్లను, పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరిచే చర్యలను తీసుకుంది. భారత ప్రభుత్వం ఏఐకి చాలా ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పొచ్చు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సోమవారం నుంచి మొదలు కానుండగా, ఏఐలో ఇండియా ప్రోగ్రస్ ఎలా ఉందో చూద్దాం.
పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సపోర్ట్
ప్రభుత్వం రూ.10,372 కోట్లతో ఇండియా ఏఐ మిషన్‌ను మార్చి 2024లో లాంచ్ చేసింది. బలమైన పబ్లిక్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేసింది. ఇది డిజిలాకర్, ఆధార్ లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) మాదిరిగా పనిచేస్తుంది. 38 వేలకు పైగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్(జీపీయూల)ను మొబిలైజ్ చేయగా, దీనిని ఎన్విడియా హెచ్100, హెచ్200, ఏఎండీ ఎంఐ300ఎక్స్, ఇంటెల్ గౌడి2, ఏడబ్ల్యూఎస్ ట్రైనియం వంటి వివిధ కంపెనీలకు చెందిన చిప్‌లతో బిల్డ్ చేసింది. స్టార్టప్స్, అకాడమియా, రీసెర్చర్స్ 40శాతం వరకు సబ్సిడీ రేటుతో ఈ హార్డ్‌వేర్‌ను వాడుకోవచ్చు. ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్ ద్వారా రిక్వెస్ట్ చేసి యాక్సెస్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. డేటాసెట్స్, పర్సనల్ ఖర్చుల్లో 25 శాతం వరకు భారాన్ని మోస్తుంది.
* ప్రభుత్వం నేషనల్ ఏఐ డేటాసెట్స్, మోడల్స్ స్టోర్ చేసే రిపోజిటరీ (స్టోరేజ్) ఏఐకోష్‌ను డెవలప్ చేసింది. ఇందులో 9,867 కి పైగా డేటాసెట్స్, 273 కి పైగా ఏఐ మోడల్స్ ఉంచారు. స్టార్టప్‌లు తమ లాంగ్వేజ్ మోడల్స్‌ను డెవలప్ చేయాలనుకుంటే డేటాను ఏఐకోష్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కామన్ యూజర్లు కూడా డేటాను పొందొచ్చు.
* ఇండియాఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా భారతదేశం కోసం స్పెసిఫిక్‌గా లార్జ్ మల్టీమోడల్ మోడల్స్‌ను డెవలప్ చేసే కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సర్వంఏఐ, భారత్‌జెన్, ఎవరెస్ట్ వంటి స్టార్టప్‌లతో కలిసి ఇండిక్ లాంగ్వేజెస్ మోడల్స్ బిల్డ్ చేస్తోంది. గ్లోబల్ మోడల్స్‌పై డిపెండెన్సీ తగ్గించడం ముఖ్య ఉద్దేశం. ఇండియా ఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్ ద్వారా డీప్-టెక్ ఏఐ స్టార్టప్స్‌కు రిస్క్ క్యాపిటల్, ఫండింగ్ ఇవ్వడానికి రూ.2 వేల కోట్లు అలాట్ చేసింది.
* భాషిణి అనే జాతీయ భాషా ఏఐ ప్లాట్‌ఫామ్‌ను నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ మిషన్ (ఎన్ఎల్‌టీఎం) కింద 2022లో ప్రభుత్వం లాంచ్ చేసింది. భారతదేశంలోని భాషా అడ్డంకులను తొలగించి, ప్రతి పౌరుడు తన సొంత భాషలో డిజిటల్ సేవలు సులభంగా పొందేలా చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇంగ్లీష్‌తో సహా 36కి పైగా భారతీయ భాషలను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇటీవల యూఎస్ సర్వర్స్ నుంచి యొట్టో సావరిన్ ఇండియాక్లౌడ్ అండ్ జీపీయూ ఇన్‌ఫ్రాకి డేటాను మైగ్రేట్ చేశారు. దీంతో డేటా భద్రత పెరిగింది. అంతేకాకుండా ఇండియాఏఐ మిషన్, ఏఐకోష్‌తో లింక్ చేశారు. భాషిణితో గవర్నమెంట్ సేవలు (ఆధార్, యూపీఐ, హెల్త్, ఎడ్యుకేషన్ వంటివి) లోకల్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. స్టార్టప్స్, డెవలపర్స్ తమ ఏపీఐల ద్వారా ఇంటిగ్రేట్ చేసి మల్టీలింగ్వల్ యాప్స్‌ను తక్కువ రేటుకి బిల్డ్ చేసుకోవచ్చు.
పాపులర్ ఇండియన్ స్టార్టప్‌లు..
ఇండియా ఏఐ స్టార్టప్‌లలో సర్వం ఏఐ, కోర్‌వర్.ఏఐ వంటివి చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా సావరిన్ ఏఐపై ఫోకస్, ఇండిక్ లాంగ్వేజెస్ పెర్ఫార్మెన్స్, ప్రభుత్వ సపోర్ట్ వల్ల ఇవి విస్తరిస్తున్నాయి.
సర్వం ఏఐ
2023లో స్టార్ట్ అయిన ఈ బెంగళూరు కంపెనీ కొన్ని అంశాల్లో చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని మోడల్స్‌ను అధిగమించి మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. ప్రభుత్వం ఇండియాఏఐ మిషన్ కింద ఫస్ట్ స్టార్టప్‌గా సెలెక్ట్ చేసి, ఇండియా సావరిన్ ఎల్‌ఎల్‌ఎం (స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్) బిల్డ్ చేయమనే టాస్క్ ఇచ్చింది.
ఇండిక్ లాంగ్వేజెస్‌లో (హిందీ, తమిళం, తెలుగు మొదలైనవి) గ్లోబల్ మోడల్స్ చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చూపించింది. క్లిష్టమైన ఇండియన్ డాక్యుమెంట్స్ రీడింగ్, నేచురల్ స్పీచ్ జనరేషన్‌లో టాప్ స్కోర్ సాధించింది. సర్వం2బీ, బుల్‌బుల్ వీ3టీటీఎస్ రిలీజ్ చేసి, డెవలపర్స్ మధ్య పాపులర్ అయింది. ఈ కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి భారీగా ఫండింగ్ అందుకుంటోంది.
కృత్రిమ్ ఏఐ
ఓలా ఫౌండర్ భవీశ్ అగర్వాల్ దీనిని 2023లో మొదలుపెట్టారు. మొదటి ఇండియన్ ఏఐ యూనికార్న్‌గా 2024లో మారింది. మోడల్స్, క్లౌడ్ , కస్టమ్ సిలికాన్ వంటివి బిల్డ్ చేస్తోంది. కృత్రిమ్ ప్రో, కృత్రిమ్ ఏజెంటివ్ ఏఐ వంటి మల్టీలింగ్వల్ ఎల్‌ఎల్‌ఎంలు రిలీజ్ చేయగా, ఇండియన్ లాంగ్వేజెస్‌లో కోడ్ జనరేషన్‌లో 80 శాతానికి పైగా సక్సెస్ రేట్ సాధించింది.
గ్నాని.ఏఐ
ఈ బెంగళూరు స్టార్టప్ 2016లో మొదలైంది. వాయిస్ ఏఐ, స్పీచ్ రికగ్నిషన్‌లో ముందుంది. ఇండిక్ లాంగ్వేజెస్‌లో టాప్ పెర్ఫార్మర్. ఇండియా ఏఐ మిషన్‌లో సెలెక్ట్ అయి, వాయిస్-ఫస్ట్ ఫౌండేషనల్ మోడల్ బిల్డ్ చేస్తోంది. బ్యాంకింగ్, టెలికాం, కస్టమర్ సపోర్ట్‌లో తన సేవలను విస్తరిస్తోంది.
గాన్.ఏఐ, కోరోవర్.ఏఐ
గాన్.ఏఐ వాయిస్ , మల్టీమోడల్ మోడల్స్‌ను డెవలప్ చేస్తుండగా, కోరోవర్.ఏఐ తెచ్చిన భారత్‌జీపీటీ మిని, వాయిస్-బేస్డ్ చాట్‌బాట్స్‌ను గవర్నమెంట్ సేవలు, ఎడ్యుకేషన్ కోసం డెవలప్ చేస్తోంది. ఇది ఆఫ్‌లైన్‌లోనూ పనిచేయగలదు. యూరప్‌కు సర్వీస్‌లను ఎగుమతి చేస్తోంది.
