- 2023లో గవర్నర్ రవిపై శివాజీ కృష్ణమూర్తి కామెంట్స్
- దోషిగా తేల్చి, జైలు శిక్షతోపాటు ఫైన్ విధించిన కోర్టు
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తికి కోర్టు మూడేండ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధించింది. గవర్నర్ రవి 2023లో రాష్ట్ర అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలను చదవకుండా వదిలేశారు. దీంతో గవర్నర్ తోపాటు అన్నా డీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి, మాజీ మంత్రి జయకుమార్, బీజేపీ నేతలు అన్నామలై, ఖుష్బూలపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా చెన్నైలోని ఎగ్మూర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవడం ఇష్టంలేకపోతే కాశ్మీర్ కు వెళ్లాలని, అక్కడికి తాము ఓ టెర్రరిస్ట్ ను పంపితే కాల్చి చంపేస్తాడంటూ గవర్నర్ పై శివాజీ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
గవర్నర్ తోపాటు ఇతర నేతలపైనా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను డీఎంకేతోసహా అన్ని పార్టీలు ఖండించాయి. డీఎంకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. కొన్నాళ్ల తర్వాత తిరిగి పార్టీలోకి తీసుకుంది. తాజాగా శివాజీకి జైలు శిక్ష పడటంపై మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ.. శివాజీ మాట్లాడిన మాటలు చూస్తే.. డీఎంకే మోడల్ ఏంటో తెలుస్తుందన్నారు. వాళ్లు మహిళల పట్ల చాలా అభ్యంతరకరంగా మాట్లాడతారని విమర్శించారు.
