- కీలక శాఖలన్నీ ఆయనే దగ్గరే పెట్టుకుండు: ఆర్‌ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, వెలుగు: కీలక శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే పెట్టుకొని ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మున్సిపల్, హోం శాఖ, విద్యా శాఖలను తన వద్దే పెట్టుకున్నారని, మున్సిపల్ శాఖ రేవంత్ వద్ద ఉండడంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు. అసలు ఆయన దగ్గర హోం శాఖ ఎందుకుందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల కోడ్‌ను ఎవరు ఉల్లంఘించినా ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వాలని, వికారాబాద్ సభలో హస్తం గుర్తుకు ఓటేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్‌గా చెప్పినా ఎన్నికల సంఘం ఎందుకు నోటీసులివ్వడం లేదని ప్రశ్నించారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల రోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులను బూతులు తిట్టారన్నారు. అర్వింద్‌ది నోరా.. బోరా.. అని మండిపడ్డారు. జగ్గారెడ్డి 34వ వార్డులో రౌడీషీటర్లతో వచ్చి పోలీసులను తోసివేసి హంగామా చేశారన్నారు. మిర్యాలగూడలో సీపీఎం కార్యకర్తను కాంగ్రెస్ వాళ్లు చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్‌కు మెజారిటీ వచ్చిందని, అయితే వాళ్లు క్యాంపులో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని, పోలీసులను వారిని పంపించారని ఆరోపించారు. కొన్నిచోట్ల మఫ్టీ పోలీసులను క్యాంపులకు పంపారన్నారు.
