నీళ్ల లెక్కలను ఏపీ అప్ లోడ్ చేయట్లే... 555 టీఎంసీలే ఏపీ వాడుకున్నదన్న కృష్ణా బోర్డుకు ENC ఘాటు రిప్లై

నీళ్ల లెక్కలను ఏపీ అప్ లోడ్ చేయట్లే... 555 టీఎంసీలే ఏపీ వాడుకున్నదన్న కృష్ణా బోర్డుకు ENC ఘాటు రిప్లై
  • 245 రోజుల్లో 108 రోజుల డేటాను అప్​లోడ్​ చేయని పొరుగు రాష్ట్రం
  • అయినా ఏపీ లెక్కలనే పరిశీలిస్తున్న కృష్ణా బోర్డు
  • కృష్ణా డెల్టా, కేసీ కెనాల్, గుంటూరు కెనాల్​ ద్వారా తీసుకున్న 113.23 టీఎంసీలు లెక్కలోకి రాలేదు
  • తెలుగు గంగ నుంచి మరో 20 టీఎంసీలనూ లెక్కలో చూపలేదన్న తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్లను దర్జాగా తన్నుకుపోతున్న ఏపీ.. ఆ లెక్కలను మాత్రం పోర్టల్​లో అప్​లోడ్​ చేయట్లేదు. ఈ ఏడాది వాటర్​ ఇయర్​లో 245 రోజుల పాటు నీళ్లను తరలించుకున్న పొరుగు రాష్ట్రం.. అందులో 108 రోజుల డేటాను మాత్రం అప్​లోడ్​ చేయలేదు. ఈ విషయాన్ని సీరియస్​గా  తీసుకోవాల్సిన కృష్ణా బోర్డు.. ఏపీ చెప్పిన లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ తెలంగాణ చెప్తున్న లెక్కలను ఖాతరు చేయడం లేదు. దీనిపై కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ (జనరల్) ఘాటు లేఖ రాశారు. ఏపీ చెప్పిన లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటూ.. తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ వాటర్​ ఇయర్​లో ఇప్పటివరకు ఏపీ 555.502 (79.21 శాతం) టీఎంసీలే తీసుకెళ్లిందంటూ చెప్పడం దారుణమన్నారు. నీటి వాడకాన్ని తగ్గించాలని ఏపీని బోర్డు కోరినా ఇప్పటికీ తగ్గించుకోకపోవడం దారుణమన్నారు. జనవరి 31 నాటికి ఏపీ 668.343 టీఎంసీలను వాడుకుంటే.. తెలంగాణ కేవలం 176.645 టీఎంసీలే వాడుకున్నదని స్పష్టం చేశారు. 

కానీ, కృష్ణా బోర్డు మాత్రం ఏపీ వాడుకున్న నీళ్లలో 112.801 టీఎంసీలు తక్కువ చేసి చూపించిందని, ఇటు తెలుగు గంగ నీటి వాడకంలోనూ20.608 టీఎంసీలు తక్కువ చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టా సిస్టమ్, కేసీ కెనాల్, తెలుగు గంగ ప్రాజెక్టుల నుంచి ఏపీ వాడుకున్న నీళ్లలో చాలా తేడాలున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఒక్క కేడీఎస్​లోనే 166 టీఎంసీల వినియోగం..

ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక్క కృష్ణా డెల్టా సిస్టమ్​లోనే ఏపీ 166.190 టీఎంసీల నీటిని తరలించుకుపోయిందని లేఖలో ఈఎన్​సీ పేర్కొన్నారు. కానీ, కృష్ణా బోర్డు మాత్రం 94.204 టీఎంసీలే ఏపీ వాడుకుందని చెప్పిందని, 71.986 టీఎంసీలు తక్కువగా చూపించారని పేర్కొన్నారు. 245 రోజుల వాటర్​ డేటాలో కేవలం 108 రోజుల డేటానే కృష్ణా బోర్డు పోర్టల్​లో ఏపీ అప్​లోడ్​ చేసిందని చెప్పారు. ప్రకాశం బ్యారేజీలో సర్​ప్లస్​ లేనప్పుడే.. గోదావరి డైవర్షన్​ను పరిగణనలోకి తీసుకోవాలని, అది కూడా 7.511 టీఎంసీలకు బదులు 5.945 టీఎంసీలకే అనుమతివ్వాలని తేల్చి చెప్పారు. 

ఇక, గుంటూరు చానెల్​ ద్వారా 1.601 టీఎంసీలను తరలించగా.. 0.597 టీఎంసీలు వాడుకున్నదని చెప్పారని, తేడా 1.004 టీఎంసీలుగా ఉందని పేర్కొన్నారు. ‘‘తుంగభద్ర డ్యాం నుంచి కేసీ కెనాల్​ద్వారా 3.278 టీఎంసీలు, సుంకేసుల బ్యారేజీ నుంచి కేసీ కెనాల్​ ద్వారా 36.963 టీఎంసీలను ఏపీ తీసుకెళ్లింది. అసలు ఆ లెక్కలనే కృష్ణా బోర్డు లెక్కలో చూపించలేదు. మొత్తంగా 113.231 టీఎంసీలు లెక్కలోకి రాలేదు. ఇటు తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి ఏపీ 34.795 టీఎంసీలు వాడుకున్నది. కానీ, బోర్డు మాత్రం 14.233 టీఎంసీలనే వినియోగంగా చూపించింది. 20.562 టీఎంసీలను లెక్కలో చూపలేదు. ఈ లెక్కలను మేం బోర్డుకు చెప్పినా.. వాటిని మీరు పరిగణనలోకి తీసుకోలేదు’’ అని పేర్కొన్నారు. 

రోజూ మానిటర్​ చేయాల్సిందే..

ఏపీ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల నీటి వినియోగాన్ని కృష్ణా బోర్డు నియంత్రించాల్సి ఉంటుందని లేఖలో ఈఎన్​సీ స్పష్టం చేశారు. కాబట్టి శ్రీశైలం, నాగార్జునసాగర్​, కృష్ణా డెల్టా సిస్టమ్​, తెలుగు గంగ, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. రోజూ లేదంటే వారానికోసారైనా నీటి తరలింపులను పర్యవేక్షించాలన్నారు. నిరంతర పర్యవేక్షణ ద్వారానే ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లను తీసుకెళ్తున్నదో తెలుస్తుందని పేర్కొన్నారు. 

ఏడాదిలో 8 నెలల డేటాను అప్​లోడ్​ చేయకపోయినా.. కృష్ణా బోర్డు నీటి వినియోగ లెక్కలపై పున:సమీక్ష చేయకపోవడం విచారకరమన్నారు. బోర్డు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం చూస్తుంటే బోర్డు సమర్థంగా పనిచేయడం లేదన్న విషయం తేటతెల్లమవుతున్నదని పేర్కొన్నారు. 

కోటా అయిపోయినా ఇంకా వాడుకుంటున్నరు..

కామన్​ రిజర్వాయర్లలో (శ్రీశైలం, సాగర్​) ప్రస్తుతం 164.475 టీఎంసీల జలాలున్నాయని, అవన్నీ తెలంగాణ కోటావేనని ఈఎన్​సీ స్పష్టం చేశారు. అదేసమయంలో జనవరి 29 నాటికే ఏపీ కోటా మొత్తం పూర్తయిందని, కోటాకు మించి 20.1076 టీఎంసీలను ఎక్కువగా వాడుకున్నదని పేర్కొన్నారు. కోటా తర్వాత ఏపీ వాడుకున్న నీళ్లన్నీ తెలంగాణవేనని చెప్పారు. సాగు, తాగునీటికి సంబంధించి తెలంగాణ భవిష్యత్​ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. తమ హక్కులను బోర్డు కాపాడాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. 

ఇప్పుడున్న 164.475 టీఎంసీల నీళ్లను  మే 31 వరకు.. తెలంగాణకే కేటాయించేలా వాటర్​ రిలీజ్​ ఆర్డర్స్​ జారీ చేయాలని బోర్డును డిమాండ్​ చేశారు. నీటి వాడకాన్ని తగ్గించాలని బోర్డు చెప్పినా.. ఏపీ ఇప్పటికీ నీటి తరలింపులను ఆపలేదని, శ్రీశైలం, సాగర్​ నుంచి ఇప్పటికీ నీటిని విడుదల చేసుకుంటూనే ఉందని ఆక్షేపించారు. వెంటనే ఏపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

బోర్డు మీటింగ్​ ఊసే లేదు..

నీటి వినియోగంపై వాస్తవానికి జనవరిలోనే సమావేశం నిర్వహిస్తామని కృష్ణా బోర్డు పేర్కొంది. అందుకు అనుగుణంగా డిసెంబర్​ తొలి వారంలోనే రెండు రాష్ట్రాలకూ లేఖ రాసింది. ఎజెండాను సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎజెండాను సమర్పించింది కూడా. కానీ, ఏపీ మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది. ఏపీని తొందరపెట్టాల్సిన బోర్డు కూడా.. తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది. 

కామన్​ రిజర్వాయర్లలో ఉన్న నీళ్లన్నింటినీ ఏపీ వాడుకునేదాకా వేచి చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ నీటి వాడకం పూర్తయిపోయేనాటికి.. తెలంగాణకు నీళ్లుండకుండా పోతాయని మన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బోర్డు మీటింగ్​ను వీలైనంత త్వరగా ఏర్పాటు  చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.