కొలంబో: ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఇండియా, పాక్ హై ఓల్టేజ్ మ్యాచుకు రంగం సిద్ధమైంది. 2026, ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి ఏడు గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మహా సంగ్రామం జరగనుంది. అయితే.. క్రికెట్ ఫ్యాన్స్ కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తోన్న ఈ హై ప్రొఫైల్ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. శ్రీలంక వాతావరణ శాఖ ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం (ఫిబ్రవరి 15) మధ్యాహ్నం 93% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు శ్రీలంక వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. అయితే.. సాయంత్రానికి అది తగ్గే ఛాన్స్ ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్, నాకౌట్ మ్యాచులకు రిజర్వ్ డే లేదు.
కేవలం ఫైనల్ మ్యాచ్కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా ఇండియా, పాక్ మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు తప్ప మరో రోజు మ్యాచ్ నిర్వహించరు. దీంతో ఇప్పటికే చెరో నాలుగు పాయింట్లు సాధించిన ఇండియా, పాక్ జట్లు.. మ్యాచ్ రద్దు అయితే లభించే పాయింట్ ద్వారా నేరుగా గ్రూప్ 8కు అర్హతకు సాధిస్తాయి. దీనివల్ల అమెరికా, నెదర్లాండ్స్ జట్లకు నష్టం జరుగుతుంది.
కొలంబోలో ఫిబ్రవరి 15న వర్షం కురిసే అవకాశాలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం కేవలం 13 శాతం మాత్రమే ఉందని AccuWeather తెలిపింది. ఎలాగూ.. ఇండియా, పాక్ మ్యాచ్ సాయంత్రం 6 తర్వాతే కాబట్టి దాదాపు వర్షం పడే అవకాశాలు తక్కువనే చెప్పాలి. కాకపోతే.. రాత్రి 11 గంటల వరకూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని AccuWeather పేర్కొంది.
ఒకవేళ.. సాయంత్రం 7 గంటల సమయంలో వర్షం కురిసినా మ్యాచ్ ఆలస్యం అవుతుందే తప్ప రద్దయ్యే ఛాన్స్ లేదు. రాత్రి 10 గంటల వరకూ అంపైర్లు పరిస్థితి చూస్తారు. అప్పటికి వర్షం తగ్గితే చెరో 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. అప్పటికీ వర్షం తగ్గకుండా కంటిన్యూగా పడుతుంటే అప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ చేసి చెరో పాయింట్ ఇస్తారు.
