- డిప్యూటీ మేయర్, రెండు కోఆప్షన్ పోస్టులు మజ్లిస్‌కు ఇచ్చేలా ఒప్పందం
- మేయర్ క్యాండిడేట్ ఎంపికలో కాంగ్రెస్ నేతలు బిజీ
- ఈసీ నిర్ణయంతో వెనక్కితగ్గిన బీజేపీ
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్‌కు దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్‌తో పాటు రెండు కో ఆప్షన్ పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదరడంతో ఇందూరు కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. మ్యాజిక్ ఫిగర్‌కు మూడు ఓట్ల దూరంలో ఉన్న బీజేపీ ప్రధాన పదవులకు జరిగే ఎన్నికలో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు మేయర్ క్యాండిడేట్ ఎంపికపై కాంగ్రెస్ ముఖ్యనేతలు హైదరాబాద్‌లో కసరత్తు చేస్తున్నారు. క్యాండిడేట్ పేరును ముందుగానే ప్రకటించకుండా.. సీల్డ్ కవర్‌లో ఎన్నిక జరిగే టైంకు నిజామాబాద్ చేరేలా ప్లాన్ చేస్తున్నారు.
రిజల్ట్ వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ ప్రయత్నాలు
నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. 28 స్థానాల్లో బీజేపీ క్యాండిడేట్లు విజయం సాధించారు. 17 డివిజన్లలో కాంగ్రెస్, 14 డివిజన్లలో మజ్లిస్ గెలిచింది. ఇక బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఒకే ఒక్క కార్పొరేటర్ సైతం కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. దీంతో మజ్లిస్‌ను కలుపుకోవడంతో పాటు ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లతో బలాన్ని 34కు పెంచుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవితో పాటు రెండు కోఆప్షన్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించడంతో మజ్లిస్ నేతలు సైతం ఒకే చెప్పారు. దీంతో మేయర్ పోస్ట్ కాంగ్రెస్‌కు దక్కడం ఖాయమైంది.
ఈసీ నిర్ణయంతో సైలెంట్ అయిన బీజేపీ
నిజామాబాద్ కార్పొరేషన్‌లో 28 కార్పొరేటర్ స్థానాలు గెలిచిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఇక్కడ ఎంపీ అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు ఎక్స్‌అఫీషియో హోదా ఉంది. ఆర్మూర్ సెగ్మెంట్ పరిధిలోని మాక్లూర్ మండల శివారు గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం అయినందున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి ఎక్స్‌అఫీషియో ఓట్లతో బలాన్ని 33కు పెంచుకొని మేయర్ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ లీడర్లు భావించారు.
కానీ నగర పరిధిలో ఓటు హక్కు ఉన్న రాజ్యసభసభ్యులు, ఎమ్మెల్సీలకే ఎక్స్‌అఫీషియో హోదా దక్కుతుందని ఈసీ స్పష్టం చేయడంతో బీజేపీకి షాక్ తగిలింది. ఈసీ నిర్ణయంతో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డికి ఎక్స్‌అఫీషియో హోదా దక్కకపోవడంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవడం కష్టంగా మారింది. దీంతో మేయర్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్‌లో బలమైన ప్రతిపక్ష హోదా నిర్వహిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా ప్రకటించారు.
మేయర్ ఎంపికపై కాంగ్రెస్ లీడర్లు బిజీ
నిజామాబాద్ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పోస్ట్ కోసం కాంగ్రెస్ నుంచి 19వ వార్డు కార్పొరేటర్‌గా బరిలో నిలిచిన కాటిపల్లి శమంతకుమారి, 25 డివిజన్ నుంచి పోటీ చేసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి కోడలు శ్వేత ఓడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచిన 17 మంది కార్పొరేటర్లలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. వీరిలో నలుగురు మైనార్టీలు, మరో నలుగురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఎస్టీ వర్గానికి చెందిన మహిళ కార్పొరేటర్‌గా ఉంది.
వీరిలో మేయర్ పోస్ట్ కోసం కూరగాయల ఉమారాణి, అరుంధతి, పంచరెడ్డి లలిత, బొంబొత్తుల పూజిత గౌడ్ పేర్లను కాంగ్రెస్ లీడర్లు పరిశీలిస్తున్నారు. అన్నీ సమీకరణాలను బేరీజు వేసుకొని మేయర్ క్యాండిడేట్‌ను ఎంపిక చేసి, ఆ పేరును సీల్డ్ కవర్‌లో సోమవారం నిజామాబాద్‌కు పంపనున్నారు. మజ్లిస్‌కు ఇచ్చిన డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం 52 డివిజన్ కార్పొరేటర్, పార్టీ సిటీ ప్రెసిడెంట్ మహ్మద్ షకీల్ అహ్మద్ భార్య, 54 డివిజన్ కార్పొరేటర్ సల్మా తహసీన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌కు నామినేట్ చేసే మొత్తం ఐదు కోఆప్షన్ సభ్యుల్లో కూడా మజ్లిస్ తరఫున ఇద్దరిని నామినేట్ చేయనున్నారు.
