- పార్లమెంటులోకి కుక్కను తీసుకురావడంతో చర్యలకు సిద్ధమైన కమిటీ
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్లమెంటు కాంప్లెక్స్ లోకి వీధి కుక్కను తీసుకురావడంతో పాటు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలకు కమిటీ సిద్ధమైంది. ఎంపీ రేణుకా చౌదరిపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ స్వీకరించింది. ఫిబ్రవరి 23లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆమెను ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 1న ఎంపీ రేణుకా చౌదరి ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటు కాంప్లెక్స్ లోకి తీసుకువచ్చారు.
దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘లోపల కూర్చున్న వారే కరుస్తారు. కుక్కలు కాదు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎంపీలు బ్రిజ్ లాల్, ఇందు బాలా గోస్వామి రాజ్యసభ నియమావళిలోని రూల్-–188 ప్రకారం రేణుకా చౌదరిపై ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులు, పార్లమెంటు గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని వాదించారు.
పార్లమెంటు కాంప్లెక్స్ లోకి వీధి కుక్కను తీసుకురావడం ద్వారా భద్రతా ప్రోటోకాల్స్ ను ఆమె ఉల్లంఘించారని ఆరోపించారు. ఎంపీల హుందాతనాన్ని కాపాడేందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. గత వారం జరిగిన సమావేశంలో కమిటీ దీనిని పరిశీలించింది. ఆమె నుంచి రాతపూర్వక వివరణ కోరాలని నిర్ణయించింది. ఈ నోటీసుపై రేణుకా చౌదరి కార్యాలయం స్పందించింది. పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా సమాధానం ఇస్తామని పేర్కొంది.
