యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారత రైతులకు ద్రోహం: రాహుల్‌‌‌‌ గాంధీ

యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారత రైతులకు ద్రోహం: రాహుల్‌‌‌‌ గాంధీ
  • దేశ ప్రయోజనాలకు బీజేపీ సర్కారు తాకట్టు పెడుతున్నది: రాహుల్‌‌‌‌ గాంధీ
  • ఇది తాత్కాలిక అంశం కాదు.. రైతుల భవిష్యత్తుకు సంబంధించినది
  • అమెరికా జన్యుమార్పిడి పంట వ్యర్థాలను  మన దేశ పశువులకు ఆహారంగా పెడతారా? 
  • దీనివల్ల మన పాల ఉత్పత్తులు అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడే పరిస్థితి రాదా? అని ప్రశ్న

భారత్-అమెరికా ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మన రైతులకు తీరని ద్రోహం జరుగుతున్నదని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో మండిపడ్డారు.

న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం తీరును లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎండగట్టారు. ఈ ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌తో భారతీయ రైతులకు తీరని ద్రోహం జరుగుతున్నదని ఆరోపించారు.  ఈ ఒప్పందం ద్వారా మోదీ సర్కారు దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు. ఆదివారం రాహుల్‌‌‌‌గాంధీ సోషల్​ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ‘ఎక్స్‌‌‌‌’లో పోస్ట్​ పెట్టారు. ‘‘అమెరికా వాణిజ్య ఒప్పందం పేరుతో భారత రైతులకు జరుగుతున్న ద్రోహాన్ని మనం చూస్తున్నాం”అని పేర్కొన్నారు.  ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌తో  దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని బీజేపీ సర్కారు రాజీ పడేలా చేస్తున్నదని మండిపడ్డారు.  ఇది తాత్కాలిక అంశం కాదని, రైతుల భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు. భారత వ్యవసాయ రంగంపై మరో దేశం దీర్ఘకాలిక పట్టు సాధించేందుకు మనం అనుమతిస్తున్నామా? అని ప్రశ్నించారు. 

ప్రధాని మోదీపై ప్రశ్నల వర్షం..
ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌తో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలంటూ ప్రధాని మోదీపై రాహుల్‌‌‌‌గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ (డీడీజీ) దిగుమతి చేసుకోవడం అంటే ఏమిటి? అమెరికాకు చెందిన జన్యుమార్పిడి (జీఎం) మక్కజొన్న నుంచి తయారైన వ్యర్థాలను భారతీయ పశువులకు ఆహారంగా పెడతారా? దీనివల్ల మన పాల ఉత్పత్తి అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడే పరిస్థితి రాదా?” అని ప్రశ్నించారు.

ఒకవేళ భారత్ జన్యుమార్పిడి చేసిన (జీఎం) సోయా ఆయిల్ దిగుమతికి అనుమతిస్తే.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, దేశవ్యాప్తంగా ఉన్న సోయా రైతుల పరిస్థితి ఏమవుతుంది?.. వారు మరోసారి ధరల పతనాన్ని ఎలా తట్టుకోగలరు? అని నిలదీశారు. ‘అదనపు ఉత్పత్తులు’ అని ప్రభుత్వం చెబుతున్న జాబితాలో ఏమున్నాయి? అని అడిగారు.

భవిష్యత్తులో పప్పుధాన్యాలు, ఇతర పంటలను కూడా అమెరికా దిగుమతులకు వదిలేయాలని ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించారు. ‘‘వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే అర్థం ఏమిటి? భవిష్యత్తులో జన్యుమార్పిడి పంటలపై మన వైఖరిని సడలించాలని, లేదా ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌‌‌పీ), బోనస్‌‌‌‌లను తగ్గించాలని భారత్‌‌‌‌పై ఒత్తిడి వస్తుందా?” అని అడిగారు.

ఒకసారి తలుపులు తెరిస్తే, ప్రతి ఏటా వాటిని నియంత్రించడం కష్టమవుతుందని రాహుల్‌‌‌‌గాంధీ  ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రతిసారీ మరిన్ని పంటలను ఈ ఒప్పందంలో చేరుస్తారా? దీనిపై రైతులకు స్పష్టత ఇవ్వాలి. ఇది కేవలం ఈరోజు గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు గురించి కూడా.” అని వ్యాఖ్యానించారు.