మహిళా శక్తి ప్లాంట్లు లేట్..! కొరవడిన రెడ్కో, పంచాయతీ రాజ్ శాఖల మధ్య సమన్వయం

మహిళా శక్తి ప్లాంట్లు లేట్..! కొరవడిన రెడ్కో, పంచాయతీ రాజ్ శాఖల మధ్య సమన్వయం
  • ముందుకు సాగని ‘ఇందిరా మహిళా శక్తి’ సోలార్ ప్లాంట్ల పనులు
  • భూమి ఇచ్చేందుకు దేవాదాయ శాఖ, రుణ సదుపాయానికి సెర్ప్ రెడీ 
  • మంత్రులు భట్టి, సీతక్క చొరవ చూపితేనే ప్రాజెక్టులో కదలిక

హైదరాబాద్, వెలుగు:  మహిళా సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారిని విద్యుత్  కేంద్రాలకు ఓనర్లను చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇందిరా మహిళా శక్తి సోలార్  ప్లాంట్ల ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. దసరా నాటికే విద్యుత్  ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా..  పనుల్లో కదలిక లేదు. ప్రభుత్వ ఆశయం గొప్పదే అయినా..  అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం మహిళా సంఘాలకు శాపంగా మారింది. 

ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ భూములు ఇచ్చేందుకు రెడీగా ఉంది. పెట్టుబడికి రుణాలు అందించేందుకు సెర్ప్  సర్వం సిద్ధం చేసింది. కానీ, సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సిన రెడ్కో ఉదాసీనత, విద్యుత్  కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పై స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మహిళా సంఘాలను సోలార్  పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పక్కా ప్రణాళికలు రచించింది. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ, సోలార్  ప్లాంట్ల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాల్సిన తెలంగాణ రెన్యువబుల్  ఎనర్జీ డెవలప్‌మెంట్  కార్పొరేషన్ (రెడ్కో) మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా నెలల తరబడి ఫైళ్లు పెండింగ్​లో ఉంటున్నాయి. 

సెర్ప్  అధికారులు ఎన్నిసార్లు ప్రపోజల్స్  పంపినా, రెడ్కో నుంచి టెక్నికల్  క్లియరెన్స్  రావడం లేదని సమాచారం. ఈ సమస్య అధికారుల స్థాయిలోనే పరిష్కారమయ్యేలా కనిపిస్తలేదు. ఇంధన శాఖ పరిధిలోని రెడ్కో, పంచాయతీ రాజ్   శాఖ పరిధిలోని సెర్ప్, మహిళా సంఘాలు కలిసి పని చేయాల్సి ఉంది. కాబట్టి ఉప ముఖ్యమంత్రి (ఇంధన శాఖ మంత్రి) భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా సమావేశమైతేనే ఈ చిక్కుముడి వీడుతుందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు

పవర్  పర్చేస్  అగ్రిమెంట్ పై కొరవడిన స్పష్టత

పవర్  పర్చేస్  అగ్రిమెంట్ (పీపీఏ) పై స్పష్టత రావాల్సి ఉంది. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే కరెంట్‌ను డిస్కంలు యూనిట్‌కు ఎంత ధరకు కొనుగోలు చేస్తాయి? ఒప్పందం ఎన్ని ఏళ్లు ఉంటుంది? అనే దానిపై క్లారిటీ లేదు. ధర నిర్ణయం జరగకపోవడంతో ప్రాజెక్టు లాభసాటిగా ఉంటుందా లేదా అనే సందేహంతో బ్యాంకులు లోన్లు రిలీజ్  చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయి. మంత్రుల స్థాయిలో భేటీ జరిగి పాలసీపరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప అధికారులు ఫైళ్లను కదిలించే పరిస్థితి లేదు.

అందుబాటులో  భూములున్నా.. 

సోలార్  ప్లాంట్ల ఏర్పాటుకు ఆలయ భూములను లీజుకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సుముఖత వ్యక్తం చేసింది. సోలార్  పవర్  ప్లాంట్ల నిర్మాణానికి దేవాదాయ శాఖ అధికారులు.. హైదరాబాద్, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆలయ భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సిద్దిపేట, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ  5 జిల్లాల్లో 284.09 ఎకరాలు ఆలయ భూములు ఉండగా.. తొలి విడతలో  231.05 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. విద్యుత్ సబ్ స్టేషన్లకు 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములనే తొలి విడతగా ఎంపిక చేశారు. 

ఈ విడతలో 51 ఎకరాల్లో సోలార్ ప్లాంట్  ఏర్పాటుకు ప్రణాళిక రెడీ చేశారు.  ఒక్కో ప్లాంట్‌ను 4 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రూ.1.50 కోట్ల వ్యయంతో  0.5 మెగావాట్ల సామర్థ్యంతో వీటిని నిర్మించాలని డిజైన్  చేశారు. భూములు ఇచ్చేందుకు ఎండక్షమెంట్​ సిద్ధంగా ఉండగా.. పంచాయతీశాఖ పరిధిలోని సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.  ఇందుకు సంబంధించి రెడ్కో అధికారులకు ప్రపోజల్ సైతం పంచాయతీరాజ్ అధికారులు పంపారు.  

కానీ, రెడ్కో సంస్థ నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది.  సెర్ప్  అధికారులు కూడా మహిళలకు రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ,  రెడ్కో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా సోలార్​ ప్లాంట్ల నిర్మాణానికి ముందడుగు పడడం లేదని సమాచారం.