న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్‌లో అసలైన కిక్కిచ్చే హై-ఓల్టేజ్ పోరుకు సమయం అసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) శ్రీలంక గడ్డపై మహా సంగ్రామానికి తెరలేవనుంది. ఈ ఉత్కంఠ పోరును తిలకించేందుకు పలువురు ప్రముఖులకు ఐసీసీ ఆహ్వానాలు పంపింది. అయితే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరగనున్న హై ప్రొఫైల్ మ్యాచ్‌కు హాజరు కావాలని ఐసీసీ పంపినా ఆహ్వానాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తిరస్కరించారు.
వరల్డ్ కప్‌లో తమ జట్టే ఆడనప్పుడు ఇతర జట్ల మ్యాచ్ చూడటానికి తానేందుకు వస్తానని ఐసీసీ ఇన్విటేషన్‌ను ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని బీసీబీ అంపైర్ల కమిటీ చైర్మన్ ఇఫ్తేఖర్ రెహమాన్ ధృవీకరించారు. టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనకపోవడంతో ఇండియా, పాక్ మ్యాచుకు రావాలని ఐసీసీ పంపినా ఆహ్వానాన్ని బీసీబీ చీఫ్ అమీనుల్ ఇస్లాం తిరస్కరించారని చెప్పారు.
భద్రతా పరమైన కారణాలతో టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాలో పర్యటించలేమని.. ఇతర వేదికల్లో తమ మ్యాచులు నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటికే టోర్నీ షెడ్యూల్ ఖరారు కావడంతో బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందేనని తేల్చి చెప్పింది. చేసేదేమి లేక వరల్డ్ కప్ నుంచి బంగ్లా వైదొలిగింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది ఐసీసీ.
ఇండియా పూర్తి డామినేషన్..!
ఈ టోర్నీ చరిత్రలో దాయాదులు 8 సార్లు తలపడితే ఏడుసార్లు పాక్‌ను పడగొట్టిన ఇండియా 7–1 రికార్డుతో శత్రువు గుండెల్లో సింహస్వప్నమై గర్జిస్తోంది. అదే జోరును కొనసాగిస్తూ.. మహా శివరాత్రి పర్వదినాన లంక గడ్డపైనా అదరగొట్టి.. పాకిస్తాన్‌కు ఎనిమిదోసారి 'కాళరాత్రి' మిగల్చాలని డిసైడ్ అయింది..! చూడాలి మరీ ఈ మహా సంగ్రామంలో ఎవరూ విజేతగా నిలుస్తారో..
