ముగ్గురు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సస్పెండ్

ముగ్గురు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సస్పెండ్
  • పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఉత్తర్వులు 
  • ఎండీ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పాలసీ డెసిషన్లను వ్యతిరేకిస్తూ మీడియా సమావేశంలో విమర్శలు చేయడంతో..  ఆ కార్పొరేషన్​లో పని చేస్తున్న ముగ్గురు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. డీఈఈలు విఠల్ సింగ్, రాందాస్, ఈశ్వర్​లను సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ ఎండీ సంజయ్ కుమార్ జైన్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రం  ఏర్పడిన తర్వాత కూడా కార్పొరేషన్ లో ఆంధ్ర ఉద్యోగి పెత్తనమేమిటని ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారని ఆ ఉద్యోగులు వాపోయారు. ఎండీ నిర్ణయంపై ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య మండిపడింది. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్​ చేయడమేమిటని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో పూర్తి విచారణ చేయాలని, ఉద్యోగులపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. 
ప్రైవేటీకరణ వద్దన్నందుకేనా?  
ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోలీస్ హౌసింగ్​కార్పొరేషన్​ను ప్రైవేట్ సంస్థగా మార్చేందుకు ఉన్నతాధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ప్రైవేట్ కంపెనీగా మార్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కంపెనీ యాక్ట్ కింద మార్చుకునేందుకు అవకాశం ఉందని లీగల్ అడ్వైజర్లు చెప్పారు. దీనిపై కార్పొరేషన్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లాభం కోసం కార్పొరేషన్​ను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల 21న మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడంతో, ప్రైవేటీకరణ వద్దన్నందుకే చర్యలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి.