పదో తరగతి మాల్ ప్రాక్టీస్ కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులు

పదో తరగతి మాల్ ప్రాక్టీస్ కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులు

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో అరెస్టై కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న ఏ2, ఏ3, ఏ4 నిందితులు ప్రశాంత్, మహేశ్, గణేష్  జైలు నుంచి విడుదలయ్యారు. 

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు రాగానే తానో జర్నలిస్టుగా... జర్నలిస్టుల గ్రూపులో షేర్ చేశానని ఏ2 ప్రశాంత్ తెలిపాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. తనపై సీపీ రంగనాథ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. వీటిపై న్యాయపరంగా పోరాటం చేస్తానని పేర్కొన్నాడు. విద్యార్థుల ప్రశ్నాపత్రాలు బయటకు రావడంతో వారి భవిష్యత్తు పాడుకావద్దనే ఉద్దేశ్యంతోనే రాజకీయంగా తనకు దగ్గరగా ఉండే కొందరికి మాత్రమే పోస్టు చేసినట్లు వెల్లడించారు. బండి సంజయ్ తో తాను ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పాడు. 

పదోతరగతి ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారణమైన వారి గురించి ఆచూకి ఇవ్వడం సహా పోలీసులకు అన్ని విధాలా సహకరించానని ప్రశాంత్ తెలిపాడు. జర్నలిస్టుగా విద్యార్థుల సమస్యలు బయటకు తెచ్చిన తాను.. వారి భవిష్యత్తు ఎలా పాడు చేస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహాయం తీసుకోలేదని... కోర్టే తనకు బెయిల్ ఇచ్చిందన్నాడు.