సోషల్ మీడియాలోభారత వేరియంట్ పేరు కనిపించకూడదు

సోషల్ మీడియాలోభారత వేరియంట్ పేరు కనిపించకూడదు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు బారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తరచుగా భారత వేరియంట్ అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ వేరియంట్ ప్రమాదకరమైనది కావడంతో దీనిపై చర్చ కూడా అధికస్థాయిలోనే జరుగుతోంది. అయితే .. B.1.617 వేరియంట్ నే భారత వేరియంట్ అంటూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం  అలర్టైయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు కన్పిస్తుండటంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై ఏ సోషల్ మీడియా వేదికలోనూ భారత వేరియంట్ అనే పదం కనిపించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. భారత వేరియంట్ అనే పదంతో కూడిన కంటెంట్ ఏ మీడియాలో ఉన్నా తొలగించాల్సిందేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను భారత వేరియంట్ అని అనడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా B.1.617 వేరియంట్ ను భారత వేరియంట్ గా ఎక్కడా అనలేదని కేంద్రం వివరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని గతంలో తెలిపింది.