వ్యాక్సిన్పై కేంద్రం కీలక ప్రకటన

వ్యాక్సిన్పై కేంద్రం కీలక ప్రకటన
  • కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉచిత వ్యాక్సిన్ ను రెండు విడతలుగా పంపిణీ చేసి.. మూడో విడత బూస్టర్ డోస్ ను కూడా పంపిణీని ప్రారంభిస్తున్న తరుణంలో కొత్త విషయం బయటపడింది. దేశంలో ఇప్పటికీ 4 కోట్ల మంది ఒక్క డోస్ కూడా వ్యాక్సిన్ వేసుకోలేదట. రకరకాల అపోహల వల్ల కొంత మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై లోక్ సభలో పలువురు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. అలాంటి వారు దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ లోక్ సభ సభ్యులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా 178,38,52,566 డోసులు (దాదాపు 97.34శాతం) ఉచితంగా పంపిణీ చేశామని ఆయన వివరించారు. 

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా..

దేశంలో కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది మొదలు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు.. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా వాక్సిన్ వేస్తున్నామని భారతీ ప్రవీణ్ ప్రస్తావించారు. చాలా చోట్ల గ్రామ స్థాయిలో.. ఇంటింటికీ తిరిగి మరీ వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి రెండు విడతలుగా వ్యాక్సిన్ పంపిణీ చేసి తాజాగా బూస్టర్ డోస్ కూడా పంపిణీ ప్రారంభించారు. ఈనెల 15 నుంచి దేశ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల వరకు ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ ను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 

లాంగ్ కోవిడ్ బాధితులు 20 శాతంలోపే..

దేశంలో లాంగ్ కోవిడ్ బాధితులు 20 శాతంలోపే ఉన్నారని.. చాలా రాష్ట్రాల్లో 10 శాతం లోపే ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి తెలిపారు. దీర్ఘకాల వ్యాధులతో కొవిడ్ బారిన పడి.. వైద్యుల చికిత్స అనంతరం కోలుకుని.. తిరిగి అస్వస్థతకు గురవుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశామని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వివరించారు.